విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా బాబు పట్టించుకోలేదు
‘చంద్రబాబు నాయుడు విధానాల వల్లే రాష్ట్రంలో విద్యారంగం నాశనమైంది. చదువును మార్కెట్ వస్తువుగా మార్చి... పేదలకు దూరం చేశారు. విజన్-2020 పేరిట ఓ పథకం ప్రకారం ప్రభుత్వ విద్యావ్యవస్థను దెబ్బతీశారు. ఆయన చర్యల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దారుణం చరిత్రలో మరెక్కడా చూడలేద’ని సీపీఎం అంతర్జాతీయ వ్యవహారాల విభాగం సభ్యుడు, భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) జాతీయ పూర్వ అధ్యక్షుడు ఆర్.అరుణ్‌కుమార్ అన్నారు. ఆయన ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలివీ...
ప్రైవేటు శక్తులకు బాబు దాసోహం
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే అమలులో ఉన్న ప్రైవేటీకరణ విధానాలను మరింత వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా మారుస్తానంటూ వెలువరించిన విజన్-2020 విధానపత్రం దీనికి భూమిక అయ్యింది. అప్పటివరకు విద్యారంగంలో ప్రధానపాత్ర పోషిస్తున్న ప్రభుత్వం... క్రమంగా తన బాధ్యతను వదిలించుకుంటూ ప్రైవేటు శక్తుల పాత్రను పెంచింది. విద్య ఒక వినిమయ వస్తువుగా, మార్కెట్లో సరుకుగా మారింది. సమాజ శ్రేయస్సు కోసం విద్య అనే విధానాన్ని ‘మార్కెట్ అవసరాల కోసం విద్య’గా మార్చివేశారు.
ప్రభుత్వ కళాశాలలను దెబ్బతీశారు..
సాంకేతిక విద్యను బలపర్చాలనే పేరుతో సామాజిక శాస్త్రాల అధ్యయనాన్ని చంద్రబాబు నీరుగార్చారు. రాష్ట్రంలో అప్పటివరకు 70 శాతానికి పైగా విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివేవారు. ఈ కళాశాలలకు ప్రభుత్వ కేటాయింపులను క్రమంగా తగ్గించుకుంటూ రావడం వల్ల వీటిలో కనీస సౌకర్యాలు మొదలుకుని లెక్చరర్ల వరకు ప్రతిదానికి కొరత ఏర్పడింది. విద్యా ప్రమాణాలను ఓ పథకం ప్రకారం కాలరాశారు. ప్రైవేటు కళాశాలలకు పెద్దసంఖ్యలో అనుమతిచ్చారు. వాటి లో చేరేటట్లు విద్యార్థులను, తల్లిదండ్రులను పరోక్షంగా అప్పటి ప్రభుత్వమే ప్రోత్సహించింది. ఈ రకంగా ప్రారంభమైన ప్రైవేటు కళాశాలలు క్రమంగా ఎదిగి కార్పొరేట్ స్థాయిని సంతరించుకున్నాయి. మొత్తం విద్యారంగాన్నే శాసించే స్థాయికి చేరాయి. చిన్న విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థలు మింగివేశాయి. ఉన్నత విద్యావకాశాల కోసం అనారోగ్యకరమైన పోటీని పెంచి పోషించారు.
టీడీపీ ప్రభుత్వ విధానాల వల్లే ఆత్మహత్యలు
అప్పటి టీడీపీ ప్రభుత్వ విధానాల ఫలితంగా చరిత్రలో ఇదివరకెన్నడూ చూడని విద్యార్థుల ఆత్మహత్యలను రాష్ట్రం చూడాల్సి వచ్చింది. వీటిని నివారించేందుకు ఆనాటి ప్రభుత్వం చేసింది శూన్యం. ై ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యతారాహిత్యాన్ని, వ్యాపారతత్వాన్ని ఎండగట్టిన విద్యార్థి ఉద్యమాన్ని కర్కశంగా అణచివేసేందుకు ప్రయత్నించింది.
సామాజిక బాధ్యతను పట్టించుకోలేదు...
సమాజ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యారంగంలో, ముఖ్యంగా ఇంజనీరింగ్ రంగంలో కొత్తగా కళాశాలలు తెరవడానికి చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించింది. ఆ స్థానంలో ప్రైవేటు వ్యాపారులు కళాశాలలు తెరుచుకునేలా ప్రోత్సహించింది.
‘విజన్’ పేరిట వికృత చర్యలు
సంక్షేమ బాధ్యత నుంచి ప్రభుత్వాన్ని తప్పించడం చంద్రబాబు ‘విజన్’లో ముఖ్యమైన అంశం. విద్యార్థుల స్కాలర్‌షిప్పులను తగ్గించేందుకు పథకాలు రూపొందించారు. దీంతో వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు పెరుగుతున్న ధరలు, చాలీచాలని స్కాలర్షిప్పులతో మనోవేదనకు గురయ్యారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు...
టీడీపీ ప్రభుత్వ చర్యలు శ్రుతి మించడంతో ఆనాడు విద్యార్థులు ఉద్యమాల బాట పట్టారు. విద్యార్థులతో చర్చించి సమస్యలను పరిష్కరించే దిశగా చంద్రబాబు కదలలేదు. పైగా విద్యార్థులు సంఘటితం కాకుండా నిలవరించేందుకు ప్రయత్నించారు. విద్యార్థి సంఘాలను నిషేధించాలని చూశారు. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉండమనే వారు మూర్ఖులు గానీ, తమ మోసాలు ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడేవారు గానీ అయ్యి ఉంటారని లాలాలజపతి రాయ్ అన్నారు. చంద్రబాబు కచ్చితంగా తన మోసాలు ప్రజల దృష్టికి చేరకుండా కుటిల పన్నాగాలు పన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇటువంటి ప్రయత్నాలు నిరోధించేందుకు విద్యార్థులు అనేక పోరాటాలు చేశారు. దీనికితోడు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి, విద్యార్థి పోరాటాలు కూడా తోడయ్యాయి.