వ్యక్తితో 'అసెంబ్లీ' లుంగీ పంచాయతీ
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఓ వ్యక్తితో లుంగీ వివాదం పెట్టుకుంది. సభా కార్యక్రమాలు వీక్షించేందుకు కొంతమందితో కలసి వచ్చిన ఓ వ్యక్తిని లుంగీ ధరించాడనే కారణంతో లోపలికి అనుమతించకపోవడంతో అతడు మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. దీంతో ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ కమిషన్ అసెంబ్లీ వ్యవహారాల అధికారులకు ఆదేశాలిచ్చింది.
మలప్పురంలోని కోండోట్టి ప్రాంతానికి చెందిన కుంజిమోయిన్ అనే వ్యక్తి ఈ నెల(నవంబర్) 8న 38మంది బృందంతో కలసి అసెంబ్లీ కార్యకలాపాలు సందర్శకుల గ్యాలరీలో ఉండి వీక్షించేందుకు వెళ్లారు. అయితే, అతడు తెల్ల గళ్ల లుంగీతో అసెంబ్లీకి వెళ్లగా అలాంటి వస్త్రాధరణతో అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలోకి అనుమతించబోమని తిరస్కరించారు. దీంతో అతడు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. గ్యాలరీలోకి మాత్రమే కాకుండా కనీసం అసెంబ్లీ గేటులో నుంచి లోపలికి కూడా అనుమతించలేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.