విప్లవ శిఖరానికి నేటికీ ఘన నివాళులు
హవానా: కమ్యూనిస్టు నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో సమాధిని సందర్శించి మహానేతకు నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. గత ఏడాది నవంబర్ 25న క్యాస్ట్రో(90) కన్నుమూయగా, సంతాప సభలు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు ఆయన పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబర్ 4వ తేదీన శాంటియాగోలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సరిగ్గా నెలరోజుల్లో రోజుకు రెండువేలకు పైగా అభిమానులు ఆయన సమాధిని దర్శించేందుకు తరలివస్తున్నారని క్యూబా అధికారులు తెలిపారు. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో 70 వేల మందికి పైగా ఆయన మృతికి నివాళులు అర్పించినట్లు యుదిస్ గార్సికా అనే అధికారి వెల్లడించారు.
విప్లవ శిఖరం క్యాస్ట్రో స్వదేశమైన క్యూబా ప్రజలతో పాటుగా విదేశీ పర్యాటకులు ముఖ్యంగా జపాన్, ఇటలీ, మెక్సికో, గ్వాటిమలా దేశాల నుంచి అభిమానులు క్యాస్ట్రో సమాదిని దర్శించుకునేందుకు తరలిరావడం గమనార్హం. క్యాస్ట్రో సమాధిని దర్శించుకునే వరకూ తాను గెడ్డం గీసుకోనని ఓ సౌదీ యువరాజు ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా యుదిస్ గార్సికా ప్రస్తావించారు. తమ నాయకుడు కన్నుమూశాడని కొందరు ఆందోళన చెందుతుంటే... ఆయన నింపిన విశ్వాసంతో దేశం ముందుకు సాగుతుందని మరికొందరు నేతలు, అభిమానులు భావిస్తున్నారు. (ఇక్కడ చదవండి: శోకసంద్రంలో క్యూబా)
ఫిడెల్ క్యాస్ట్రో 1926, ఆగస్టు 13న బిరాన్ (హొల్లూయిన్ ప్రావిన్స్)లో జన్మించారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఆయన చేగువేరాతోపాటు వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా కార్యకర్తలు విప్లవ పోరాటం సాగించి 1959లో క్యూబాను విప్లవవీరుడు క్యాస్ట్రో హస్త్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు ఐదు దశాబ్దాలపాటు మకుటంలేని మహరాజుగా క్యూబాను పాలించారు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. బలమైన ప్రత్యర్థి దేశాలకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలాడు క్యాస్టో. ఆయన చనిపోయినా.. ఆయనపై అభిమానం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుందని వారు నిరూపిస్తున్నారు.