‘పింక్‌థాన్’
ఈమె పేరు విష్ణుప్రియ. అంధ విద్యార్థిని. చూపు లేకపోతేనేం.. ముందుచూపున్న అమ్మాయి. మార్చి 15నమహిళల్లో చైతన్యం కోసం ‘రన్’ చేస్తానంటోంది. ఆమే కాదు.. నటుడు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ మిలింద్ సోమన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, బ్లేడ్ రన్నర్ కిరణ్ కనోజియా.. మరెందరో ఇందుకు రెడీ అవుతున్నారు.‘పింక్‌థాన్’ పేరిట వీరు సంకల్పించిన పరుగు పందెం.. అచ్చంగా మహిళల కోసం ఉద్దేశించింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి ‘యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్’, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ కలిసి నిర్వహిస్తున్న పింక్‌థాన్‌లో వీరంతా పరుగు పంచుకోనున్నారు.
..:: శిరీష చల్లపల్లి
సర్వ సాధనలో దేహ సాధన ముఖ్యమని ఆర్యోక్తి. ఇల్లు.. పిల్లలు.. ఉద్యోగం.. అన్నింటినీ ఒంటిచేత్తో నెట్టుకొస్తున్న నారీమణులు తమ సొంత ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చేస్తారు. అందుకే నడివయసుకు వచ్చిన మహిళలెందరో ఒంట్లో నలతను నిత్యం ఎదుర్కొంటున్నారు. నడుం నొప్పి, తలపోటు వంటి చిన్నాచితకా రుగ్మతలు ఎందరో స్త్రీమూర్తులకు కామన్ అయిపోయాయి. ఇటీవల రొమ్ము క్యాన్సర్ బాధితులూ పెరిగిపోతున్నారు. మెడికల్ అధ్యయనాల ప్రకారం గతేడాది ఇండియాలో 5.27 లక్షల మంది బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తేలింది. వీరిలో 3 లక్షల మంది బలయ్యారు. రొమ్ము క్యాన్సర్‌పై పోరాటం ప్రకటించిన ‘యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్’ మార్చి 15న పీపుల్స్ ప్లాజాలో ఐదు వేల మందితో పింక్‌థాన్ నిర్వహించనుంది. ఈ నడకను విజయవంతం చేయడానికి వివిధ రంగాల నుంచి 20 మంది అంబాసిడర్లను ఎంపిక చేశారు. బుధవారం అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్ హోటల్లో వారు పింక్‌థాన్ వివరాలను వెల్లడించారు.
సీరియస్‌నెస్ లేదు..
హైదరాబాద్ మహానగరంలో రొమ్ము క్యాన్సర్‌పై పింక్‌థాన్ నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి. పింక్‌థాన్ 2012లో ముంబైలో తొలిసారి నిర్వహించారు. ఆనాటి రన్లో రెండువేల మంది మహిళలు పాలుపంచుకున్నారు. 2013లో దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో పింక్ థాన్ జరిగింది. 2014లో ఆరు నగరాల్లో 50 వేల మంది మహిళలు పాల్గొన్న పింక్‌థాన్.. ఈ ఏడాది హైదరాబాద్‌తో సహా తొమ్మిది నగరాల్లో జరగనుంది. ‘బెటర్ కాజ్‌తో నిర్వహిస్తున్న ఈ రన్ ఎందరికో స్ఫూర్తినివ్వాలి. ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి పట్టించుకునే మహిళలు.. వారి ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. యోగ, వ్యాయామం, మెడిటేషన్.. చేయడం ద్వారానే హెల్దీగా ఉంటారని అందరికీ తెలుసు. కానీ పని ఒత్తిడి, మాకెందుకులే అన్న ఫీలింగ్‌తో ఆరోగ్యాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేద’ని అంటారు మిలింద్ సోమన్.
సంకల్పం చాలు..
ఇలాంటి రన్లలో పాల్గొనాలంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ అనుకుంటారు. పింక్‌థాన్ అందుకు మినహాయింపు. మంచి కోరుతూ సాగుతున్న ఈ పరుగులో పాల్గొనాలనే సంకల్పం ఉంటే చాలంటున్నారు నిర్వాహకులు. పంజాబీ డ్రెస్, చీర, షార్ట్స్.. ఇలా ఎవరికి నచ్చిన కాస్ట్యూమ్స్‌లో వారు రావొచ్చని చెబుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను తరిమేయడమే అందరి ఎజెండా కావాలని కోరుతున్నారు. మగవాళ్లతో అన్నింటా పోటీ పడుతున్నామని చెబుతున్న ఆడవాళ్లు.. వ్యాయామం, జాగింగ్‌ల కోసం బయటకు రావడానికి మాత్రం ఇంకా ఆలోచించడం షాకింగ్‌గా ఉందని పింక్‌థాన్ మరో అంబాసిడర్ గుత్తా జ్వాల అంటున్నారు.
‘వ్యాయామం మగవాళ్ల కోసమే ఉద్దేశించింది కాదని మహిళలు గుర్తించాలి. పర్సనల్ కేర్‌తో పాటు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకోవాల్సిన బాధ్యత కూడా మహిళలపై ఉంద’ని చెబుతారామె. ఇప్పటి వరకూ తనకు జాగింగ్ చేసిన అలవాటు కూడా లేదని చెబుతున్న రేడియో మిర్చి ఆర్జే భార్గవి పింక్‌థాన్‌లో పది కిలోమీటర్ల రన్‌కు రెడీ అవుతున్నానని చెబుతోంది. ‘ఈ రన్లో పాల్గొంటున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉంది. ఉరుకుల పరుగుల జీవితానికి చెక్ పెట్టి ఆడవాళ్లంతా ఈ రన్లో పాల్గొనాల’ని పిలుపునిచ్చారామె.
కి‘రన్’ స్ఫూర్తి..
ఎక్కడ 10కే, 5కే రన్ అయినా పాల్గొంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న బ్లేడ్ రన్నర్ కిరణ్ కనోజియా కూడా పింక్‌థాన్‌లో పరిగెత్తనుంది. విధిని ఎదిరించి విజేతగా నిలిచిన కిరణ్‌ను పలకరిస్తే.. ‘కొన్నేళ్ల కిందట.. హైదరాబాద్ నుంచి మా ఊరు ఫరీదాబాద్ ట్రైన్లో వెళ్తుండగా.. ఇద్దరు ఆకతాయిలు నన్ను రైలు నుంచి తోసేశారు. ఆ ప్రమాదంలో నా ఎడమకాలు పూర్తిగా చితికిపోయింది. నాకు జీవితమే లేదనుకున్నాను. నా పేరెంట్స్ ధైర్యాన్నిచ్చారు. ఆర్టిఫిషియల్ లెగ్‌తో మళ్లీ అడుగులు వేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కడ 10కే రన్ వాలిపోతాను. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలం. క్యాన్సర్‌పై అవేర్నెస్ కల్పిస్తున్న పింక్‌థాన్‌లో పార్టిసిపేట్ చేస్తుండటం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని తెలిపింది.
ముందువరసలో..
క్యాన్సర్ సర్వైవల్ నాయకురాలుగా ఉన్న ధరణి బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించింది. పింక్‌థాన్‌లో ముందువరుసలో ఉంటానంటున్న ఆ మహిళ.. ‘క్యాన్సర్ సోకిన తర్వాత నేను నిరాశలో కూరుకుపోయాను. డాక్టర్స్ కౌన్సెలింగ్ తర్వాత నేను బతకగలననే నమ్మకం వచ్చింది. నాకేమీ కాలేదు.. కాదు అని మనసులో నిశ్చయించుకున్నాను. ట్రీట్మెంట్తో పాటు వ్యాయామం, జాగింగ్ చేస్తూ క్యాన్సర్ మహమ్మారిని అధిగమించాను’ అని తెలిపింది. మనోబలం ఉంటే ఎంతటి మహ మ్మారినైనా ఎదుర్కోవచ్చని చెబుతోంది ధరణి.