భార్య విష్ణు ప్రియతో...
రియల్‌నేమ్ కన్నా రీల్‌నేమ్ ఆదిత్యగానే సీరియల్ ప్రేక్షకులకు పరిచయం. రక్తసంబంధం కుర్రాడు అనో, దుర్గమ్మ కొడుకు అనో చెప్పుకుంటూ ఉంటారు. ‘చూసి కూడా పలకరించకుండా వెళ్లిపోతున్నావేం’ అని నిష్టూరమాడుతుంటారు. పక్కింటి కుర్రాడు అనిపించేంటంత ఆప్యాయతను చూపేలా తన నటన ద్వారా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు సిద్ధార్థ. ‘రెండేళ్లు అవుతోంది జీ తెలుగులో వచ్చే రక్తసంబంధం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువై’ అంటూ ఆనందంగా తన వివరాలను పంచుకున్నాడు సిద్ధార్ధ.
అనుకోని ప్రయత్నం
‘పుట్టి పెరిగింది వైజాగ్ దగ్గర రాజవొమ్మంగి అనే ఊరు. నాన్న కుమార్ రాజు, అమ్మ సత్యాదేవి. ఇద్దరూ ఇప్పటికీ అన్ని విషయాల్లోనూ నాకు అండగా నిలుస్తారు. డిగ్రీ పూర్తయ్యాక ఎమ్‌సీయే చేద్దామనుకునే సమయంలో విజయనగరంలో సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. అలా ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. 3 జీ లవ్, నేను నా ఫ్రెండ్, దాగుడుమూతా దండాకోర్.. ఇలా సినిమాలో నటిస్తూ ఉన్నాను. అప్పుడే సీరియల్స్ నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. స్వాతిచినుకులు, ప్రతిఘటన, ఓకే జాను, మట్టిగాజులు .. ఇలా సీరియల్స్ చేస్తూ వచ్చాను. ఈ పరిశ్రమకు వచ్చి ఆరేళ్లు అవుతోంది. 2018 జీ కుటుంబం అవార్డులో ఉత్తమ కొడుకు అవార్డు, 2019లో బెస్ట్ హీరో అవార్డులు అందుకున్నాను. నా వర్క్‌కి పూర్తి న్యాయం చేయగలుగుతున్నానని ఆనందంగా ఉంది.
బెటర్‌హాఫ్
నా భార్య విష్ణుప్రియ. తను కూడా సీరియల్స్‌లో నటిస్తుంది. విష్ణు ప్రియ, నేను చిన్ననాటి నుంచి స్నేహితులం. సినిమాల్లోనూ ఇద్దరం కలిసి చేశాం. మా ఇరువైపుల కుటుంబాలలో మా ప్రేమకు ఎవరూ అడ్డు చెప్పలేదు. దీంతో ఇద్దరం ఒకింటివారమయ్యాం. నా బెస్ట్ క్రిటిక్ తనే. అందరూ బాగా చేశారని చెప్పినా.. తను మాత్రం సరైన సూచనలు చేస్తుంటుంది. ఏ సీన్‌లో ఇంకా ఎలా చేస్తే బాగుండేదో చెబుతుంటుంది. మా అబ్బాయి అయాన్ వర్మ పుట్టి రెండు నెలలు అవుతోంది. వాడితో మాకు టైమే తెలియడం లేదు.
స్నేహమే.. జీవితం
ఎందుకు చెబుతున్నానంటే.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది నా స్నేహితులే. చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఫ్రెండ్స్ జాబితా ఎక్కువే. వాళ్ల వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. సీరియల్స్ చేయగలిగాను. ఈ పరిశ్రమకు వచ్చిన కొత్తలో వాళ్లే నాకు హెల్స్ చేశారు. ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని గట్టిగా కోరుకున్నారు. ఏ కాస్త టైమ్ దొరికినా ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం నాకున్న ఆనందాలలో ఒకటి.
రక్తసంబంధం
నన్ను ఆదిత్యగా తెలుగింటికి బాగా చేరువచేసిన సీరియల్ రక్తసంబంధం. బావ మరదళ్ల మధ్య లవ్ స్టోరీతో నడిచే ఈ సీరియల్‌లో రకరకాల మలుపులు ఉంటాయి. దుర్గమ్మ–ప్రియలు వదినామరదళ్లు. దుర్గమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుడితే సహించలేను అంటుంది. ఇది విన్న ప్రియ ఆందోళన పడుతుంది. ఇద్దరికీ ఒకేరోజున డెలివరీ అవుతుంది. దుర్గమ్మకు ఆడపిల్ల, ప్రియకు అబ్బాయి పుడతారు. దీంతో ప్రియ పిల్లలను మార్పిడి చేస్తుంది. ఈ కథలో బావామరదళ్లు అయ్యి ఆదిత్య–తులసిల మధ్య ప్రేమ ఆకట్టుకుంటుంది. తులసి గడసరి అమ్మాయి. అల్లారుముద్దుగా పెరిగిన క్యారెక్టర్ ఆదిత్య. దుర్గమ్మకు మేనకోడలు తులసి నచ్చదు. ప్రియకు కన్నకొడుకు ఎవరో తెలుసు. ఈ సన్నివేశాలన్నీ భావోద్వేగాల మధ్య నడుస్తుంటాయి. తులసికి–ఆదిత్యకు పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టకుండా అవాంతరాలు సృష్టిస్తుంటుంది దుర్గమ్మ. కుటుంబ బంధాలతో కూడిన కథనం అవడంతో ప్రేక్షకాదరణ బాగుంటోంది.
‘రక్త సంబంధం’ సీరియల్‌లో దృశ్యం
పక్కింటి కుర్రాడు
ఎప్పుడైనా దేవాలయానికి వెళితే.. అక్కడ చూసినవాళ్లు దగ్గరగా వచ్చి ‘మమ్మల్ని చూసి కూడా పలకరించట్లేదేంటి’ అని అడుగుతుంటారు. నేను ఆశ్చర్యపోతే వారే కాసేపాగి ‘మీరు సీరియల్‌లో చేస్తారు కదా! మా పక్కింటి కుర్రాడిలాగే అనిపిస్తారు’ అని మాటలు కలుపుతారు. వాళ్లు అలా అంటున్నప్పుడు నాకు ఈ గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందం వేస్తుంది.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment