భయంకరమైన అడవుల్లో షూటింగ్
హారర్ నేపథ్యంలో విశ్వశ్రీ ఆర్ట్స్ పతాకంపై దినకరన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అందమైన మాయ’. చిరుసాయి, హేమంత్, కార్తీక్, కావ్యశ్రీ, శ్రుతి, ఝాన్సీ ముఖ్య తారలు. మణీంద్రన్ దర్శకత్వ పర్యవేక్షణలో నాగరాజు నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సత్య సోమేష్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో మాజీ మంత్రి నోముల నరసింహయ్య సీడీని ఆవిష్కరించి సినీ నిర్మాత టి. ప్రసన్నకుమార్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాణ నిర్వాహకుడు నాగరాజు కొట్టి మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే సినిమా ఇది.
ఇందులో ఉన్న పాటలన్నీ బాగుంటాయి. ముఖ్యంగా ఇందులోని ప్రత్యేక నృత్య గీతం ‘కెవ్వు కేక...’ పాట స్థాయిలో ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన హారర్ చిత్రాలకన్నా ఈ సినిమా భిన్నంగా ఉంటుందని, హారర్ సన్నివేశాలు 20 రోజుల పాటు భయంకరమైన అడవుల్లో చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న కొడాలి వెంకటేశ్వరరావు, అశోక్‌కుమార్, ప్రభు, సురేశ్ కొండేటి తదితరులు సినిమా విజయం సాధించాలన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇంకా ఈ సినిమా విజయం పట్ల చిత్రబృందం తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.