‘శ్రీ విశ్వశాంతి’ : చేతిలో చిల్లిగవ్వ లేకుండానే కల సాకారం!
‘నీ దగ్గర ఏముంది?’ అనే ప్రశ్నకు తిరుగులేని జవాబు... ‘నా దగ్గర కల ఉంది!’ఆ కలే చేతిలో చిల్లిగవ్వ లేని ఎంతోమందిని విశ్వ విజేతలను చేసింది.‘శ్రీ విశ్వశాంతి’ కల కూడా అలాంటిదే. కొన్ని దశాబ్దాల క్రితం... పేదింటి బిడ్డ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు కన్న కల... శ్రీ విశ్వశాంతి. రవీంద్రుడి ‘విశ్వభారతి’లాంటి విలువైన కల అది. ‘ప్రపంచమంతా ఒకే గూడులో’ అనే నినాదం పునాదిపై ఏర్పాటైన ‘విశ్వభారతి’ తనకు స్ఫూర్తి. ఆరుగురు విద్యార్థులతో మొదలైన విశ్వశాంతి గ్రామీణ విశ్వవిద్యాలయం స్థాయికి ఎదిగింది. 16 రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ విజయ ప్రస్థానం మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాటల్లోనే...కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగుంట గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నా దగ్గర కరెన్సీ నోట్లు లేవు. కల మాత్రమే ఉంది. అయినా సరే, చిన్న గుడిసెలో ‘శ్రీ విశ్వశాంతి పాఠశాల ప్రారంభించాను. ఆరుగురు విద్యార్థులతో మొదలైన ఆ పాఠశాల ‘ఇంతింతై వటుడింతై...’ అన్నట్లుగా ఎదిగిపోయింది. బలమైన విద్యా వ్యవస్థగా నిర్మాణం అయిన ‘శ్రీ విశ్వశాంతి గ్రామీణ విశ్వ విద్యాలయం’ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది.ఆరోజుల్లో...నేను, మా ఆవిడ ప్రమీలారాణి టీచర్లుగా పనిచేసేవాళ్లం. మా నెల జీతం నూట ఇరవై రూపాయలు. ‘మేము కొత్త స్కూలు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’ అని చెప్పినప్పుడు విన్నవారు ‘ఎందుకొచ్చిన రిస్కు...వచ్చిన జీతంతో సర్దుకు పోకుండా’ అని సలహా ఇస్తారేమో?...ఇలాంటి సందేహాలు ఎన్నో వచ్చాయి.‘చాలా విజయాలు భద్ర జీవితాల్లోనే ఆగిపోతాయట!’ అనే మాట గుర్తుకు వచ్చింది. ‘నాకు ఇక్కడ సుఖంగానే ఉంది కదా... రిస్కు తీసుకోవడం ఎందుకు’ అనుకునే చాలామందిలో నేను ఉండపోదల్చుకో లేదు. నాకు ఇష్టమైన నాయకుడు జవహర్లాల్ నెహ్రు. ఆ మహనీయుడు చెప్పిన విలువైన మాట – ‘అజ్ఞానం అనేది ఎప్పుడూ మార్పుకు భయపడుతుంది’ అయితే నేను మార్పుకు భయపడే రకం కాదు. అందుకే ధైర్యంగా నా కలకు శ్రీకారం చుట్టాను. 1975 ఫిబ్రవరి 22న ఉయ్యూరు పట్ట ణంలో ఒక తాటాకు ΄ పాకలో ‘శ్రీ విశ్వశాంతి’ పాఠశాలను ప్రారంభించాం.‘ఎంతో ఊహిస్తే ఆరుగురు విద్యార్థులేనా!’ అని మేము నిరాశపడిపోలేదు. ‘ఈరోజు ఆరుగురు...రేపు నూరు మంది’ అనుకున్నాము. అది వృథా పోలేదు. మరుసటి ఏడాది నుంచే హాస్టల్‌ను కూడ ప్రారంభించాము. అక్కడ మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ఉయ్యూరు (గండిగుంట) పరిధిలో సువిశాలమైన 80 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన భవన సముదాయంతో విస్తరించింది. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులో ఉంది. ఎల్కేజీ నుంచి ప్లస్ 2 వరకూ విద్యాబోధన అందిస్తున్నాం. ‘మాదల ప్రమీలారాణి మెమోరియల్ జూనియర్ కళాశాల’ ఏర్పాటు చేశాం. దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 6500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. మా గ్రామీణ యూనివర్శిటీపై ప్రత్యక్షంగా 768 మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆరుగురితో మొదలైన విద్యాసంస్థ అందనంత ఎత్తు ఎదగడానికి కారణం ఏమిటి? ‘మన ఆదర్శాలు, అంకితభావాన్ని మరచిపోయినప్పుడు మాత్రమే అపజయం ఎదురవుతుంది’ అంటారు నెహ్రు. పేద విద్యార్థులకు అండగా ఉండాలి అనే ఆదర్శాన్ని, సంస్థ కోసం క్షణక్షణం కష్టపడాలి అనే అంకితభావానికి నేను ఎప్పుడూ దూరం కాలేదు. అదే శ్రీ విశ్వశాంతి విజయ రహస్యం. ‘శ్రీ విశ్వశాంతి ‘గుడ్‌విల్’కు గుడ్ ఎగ్జాంపుల్‌గా నిలిచినా ‘పక్కా కమర్షియల్’ దారిలోకి ఎప్పుడూ వెళ్లలేదు. ఏ ప్రాంతంలో ప్రాంరంభమైందో ఆ ప్రాంతంలోనే పెరిగి, పెద్దై వటవృక్షమై ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులకు నీడను ఇస్తోంది. విద్యాసంస్థ ఏర్పాటు చేసిన నాటి నుంచి సింగిల్ బ్రాంచ్గానే నడుపుతున్నాం. సేవాపథంలో...గ్రామీణ విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించి చేయూతఅందించాలనేది మాదల ప్రమీలారాణి కోరిక. ఆమె కోరిక మేరకు ఏటా 300 మందికి పైగా విద్యార్థులకు ఫీజు రాయితీ ఇస్తున్నారు. ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీ విశ్వశాంతి నిర్వహిస్తోంది. ‘50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ అంతర్జాతీయ ప్రమాణాలు, అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనతో విద్య అందించటం కోసం పాటుపడుతున్నాం. కుమారులు, కోడళ్లు అంతా పాఠశాలలోనే ఉంటూ విద్యా ప్రగతిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చక్కగా చదివితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా దేశ ప్రగతి సాధ్యమవుతుంది’ అంటున్నారు మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఫేస్ ప్రోగ్రాంఅధునాతన సౌకర్యాలు, వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ల్యాబ్‌లు, లైబ్రరీలు గ్రామీణ యూనివర్శిటీలో అందుబాటులో ఉన్నాయి. ‘ఫేస్ప్రోగ్రాం’ పేరుతో విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఐఐటీ, జెఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, ఎన్డీఏ, నీట్, ఒలంపియాడ్లకు కోచింగ్‌లను అందిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విశ్వశాంతిలో శిక్షణ పొదిన ఎంతోమంది విద్యార్థులు నేవీ, ఆర్మీలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎన్సీసీలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విధానం ఎన్నో ప్రశంసలు అందుకునేలా చేసింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, జెఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది శ్రీవిశ్వశాంతి. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ విద్యారత్న’ పురస్కారాన్ని ‘శ్రీవిశ్వశాంతి’ ఫౌండర్ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు అందుకున్నారు. సొంతంగా పాల డైరీచదువుపై మాత్రమే కాదు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా శ్రీ విశ్వశాంతి గ్రామీణ యూనివర్శిటీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. విద్యార్థులు ఆహ్లాదభరిత వాతావరణంలో గడిపేలా ప్రాంగణం అంతా పచ్చని మొక్కలతో తీర్చిదిద్దారు. యూనివర్శిటీ సొంతంగా పాల డైరీ నిర్వహిస్తోంది. సమర్థంగా డెయిరీ నిర్వహణకు ‘బెస్ట్ డెయిరీ ఫామ్ ఆఫ్ ఏపీ అవారుర్డును అందుకున్నారు. ఈ యూనివర్శిటీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.ఇష్టంగా కష్టపడాలిప్రతి విద్యార్థికీ లక్ష్యశుద్ధి ఉండాలి. అప్పుడే లక్ష్యం సిద్ధిస్తుంది. సమయాన్ని సక్రమంగా వినియోగించు కుంటూ ఇష్టమైన పాఠ్యాంశాలను కష్టంతో కాకుండా ఇష్టంగా చదువుకోవాలి. సమయ పాలన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. తమకు అనువైన, ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో నైపుణ్యం సాధించి స్థిరపడాలి. అందుకు సూక్ష్మమైన, సున్నితమైన మార్గాలను అన్వేషించి సాధించుకోవటం అలవర్చుకోవాలి. పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని ఇష్టంతో సాధించేందుకు ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా కష్టం అనిపించదు. విజయం సాధించటం సులువు అవుతుంది. ఎవరూ పుట్టుకతోనే ఉన్నతులు కారు. జీవితంలో చూపిన అచంచలమైన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం మాత్రమే ప్రతి ఒక్కరినీ ఉన్నతులను చేస్తుంది. విద్య నేర్పే గురువులు కూడా గుర్తించాల్సింది ఏమిటంటే... గురువు అంటే నిరంతర విద్యార్థి అని అర్థం. గురువు అనే అర్థం చాలా విస్తృతమైనది. ఇది అర్థం కావాలంటే మన పూర్వ అపూర్వ శాస్త్రాలను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ నేను లైబ్రరీల్లో అనేక పుస్తకాలను చదవటం వల్ల తెలుసుకున్నదే. యుద్ధ అశాంతి నుంచి శ్రీ విశ్వశాంతి చదువుకునే రోజుల్లో లైబ్రరీకి ఎక్కువగా వెళ్లేవాడిని. జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలు చదవటం అంటే ఇష్టం. ఆయన జీవితం స్పూర్తిదాయకంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా మా సోదరుడు కృష్ణమూర్తి 18వ ఏట ఆర్మీలో చేరాడు. అప్పుడు యుద్ధాలు ఎక్కువగా ఉండేవి. ఎందరో సైనికులు చనిపోయారంటూ వార్తలు విని చాలా కలత చెందేవాణ్ణి. యుద్ధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోదనకు, వేదనకు గురవుతున్నాయి. అసలు యుద్ధం ఎందుకు? ఇరు వర్గాల నేతలు కూర్చుని సంప్రదించుకుంటే విశ్వశాంతి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఆ ఆకాంక్ష నుంచే పుట్టిందే శ్రీ విశ్వశాంతి. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలనే తలంపుతో విద్యాసంస్థను నడుపుతున్నాను.– మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు– ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా