హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ఆ పేరెలా పెట్టుకోను!
ముంబై : 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగువారికి కూడా పరిచయమైన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్. ప్రస్తుతం బాలీవుడ్లో హీరోగా, విలన్‌గా అడపాదడప కనిపిస్తున్న ఆయన తన పేరు గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. తన పూర్తి పేరు వివేకానంద అని, కానీ చిత్రసీమలోకి వచ్చాక తన పేరులోని ఆనంద్‌ను తీసేశానని ఆయన తెలిపాడు.
'నిజానికి నా పూర్తి పేరు వివేకానంద ఒబెరాయ్. మా నాన్న, తాతగారు స్వామి వివేకానందను ఆధ్యాత్మికంగా అనుసరించేవారు. ఆయన బోధనలను ఆరాధించేవారు. ప్రపంచానికి ఎనలేని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన ఆయన స్ఫూర్తితోనే నాకు వివేకానంద అనే పేరు పెట్టారు. 2002లో నేను సినిమాల్లో చేరేటప్పుడు నా పేరు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. నేను సినిమా తెరపై హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ.. చెట్టుచేమల్ని పట్టుకొని డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. వివేకానంద అని పేరు పెట్టుకొని అలాంటి పనులు ఎలా చేయగలను. అందుకే నేను నా పేరులో ఆనంద్‌ను తొలగించాను. స్వామి వివేకానంద మీద గౌరవంతోనే వివేక్ ఒబెరాయ్ పేరుతో కంటిన్యూ అవుతున్నాను' అని ఆయన ముంబైలో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. 'సాథియా' సినిమాతో తొలి హిట్ అందుకున్న ఈ హీరో తన ట్విట్టర్ అకౌంట్లో మాత్రం వివేకానంద అని కొనసాగిస్తున్నాడు.