పేస్ పదును తేల్చే సమయం!
సొంతగడ్డపై భారత జట్టు స్పిన్ బలం, బలగంపై కొత్తగా అనుమానాలు అవసరం లేదు. అయితే మన పిచ్‌లపై పేస్ బౌలర్లు చెలరేగడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు ధర్మశాల మైదానం అందుకు అవకాశం ఇస్తోంది. ఆస్ట్రేలియా వికెట్లతో పోలిక లేకున్నా... ఆ పర్యటనకు ముందు కనీసం ఒక మ్యాచ్‌లోనైనా మన ప్రధాన పేసర్ల పదునేంటో ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రత్యర్థి జట్టులోనూ నాణ్యమైన పేసర్లు ఉండటంతో భారత బ్యాట్స్‌మెన్‌కు కూడా ఈ మ్యాచ్ పరీక్షలాంటిదే.
* మరో విజయంపై భారత్ గురి
* ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూల వికెట్
* నలుగురు పేసర్లతో ఆడే అవకాశం
* నేడు వెస్టిండీస్‌తో నాలుగో వన్డే
ధర్మశాల: వెస్టిండీస్‌పై తమ ఆధిక్యం కొనసాగించాలనే పట్టుదలతో ఉన్న భారత్ మరో విజయంపై దృష్టి పెట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ దశలో నేటి మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉండదు కాబట్టి ఈ గెలుపు ఇరు జట్లకు అవసరం.
ఇషాంత్‌కు చోటు!
తొలి వన్డేలో ఓడిన భారత్ ఆ వెంటనే కోలుకొని చక్కటి విజయంతో బదులిచ్చింది. వైజాగ్ వన్డే రద్దు కావడంతో సిరీస్ నాలుగు వన్డేలకే పరిమితమైంది. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. గత మ్యాచ్‌లో స్పిన్నర్లు జడేజా, మిశ్రా కలిసి ప్రత్యర్థిని దెబ్బ తీశారు. నాలుగో స్థానంలో వచ్చి విరాట్ కోహ్లి ఫామ్ అందుకోవడం జట్టుకు కలిసొచ్చిన పరిణామం. అయితే రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన ఓపెనర్ రహానేతో పాటు రాయుడు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అన్నింటికి మించి భారత పేస్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు.
గత మ్యాచ్‌లో ఆడిన భువనేశ్వర్, షమీ, ఉమేశ్ యాదవ్ ఆకట్టుకున్నారు. ధర్మశాల మైదానం పేస్‌కు అనుకూలంగా ఉందని చెబుతున్న నేపథ్యంలో భారత్ నాలుగో పేసర్‌తో కూడా ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే మిశ్రా స్థానంలో ఇషాంత్ రావచ్చు. రెగ్యులర్‌గా వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ఇషాంత్... ఇక్కడ చెలరేగితే అతని ప్రపంచ కప్ అవకాశాలు మెరుగవుతాయనడంలో సందేహం లేదు. వన్డే జట్టులో చేరిన అక్షర్‌తో పాటు కుల్దీప్కు ఈ మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కకపోవచ్చు.
మరో పేసర్‌ను ఆడిస్తారా?
తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన వెస్టిండీస్ రెండో వన్డేలో తడబడింది. అయితే ఎనిమిదో స్థానంలో ఆటగాడి వరకు బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న ఆ జట్టు ఏ దశలోనైనా విజృంభించవచ్చు. తొలి మ్యాచ్‌లో శామ్యూల్స్ సెంచరీ సాధించగా, తర్వాతి మ్యాచ్‌లో స్మిత్ చెలరేగాడు. పొలార్డ్, బ్రేవో బ్రదర్స్ జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించగలరు. మరో వైపు జట్టంతా పేస్ బౌలర్లతో నిండి ఉంది. రవి రాంపాల్, టేలర్ స్ట్రైక్ బౌలర్లు కాగా...డ్వేన్ స్మిత్, రసెల్, స్యామీలు కూడా మీడియం పేసర్లే. కాబట్టి గత మ్యాచ్ ఆడినట్లుగానే ఒక స్పిన్నర్ బెన్‌తో ఆ జట్టు కొనసాగవచ్చు. అయితే వికెట్ పేస్‌కు బాగా అనుకూలం అనుకుంటే... హోల్డర్, రోచ్ రూపంలో వారికి మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.
పిచ్, వాతావరణం
గత నాలుగు రోజులుగా ఇది పూర్తిగా పేస్ బౌలింగ్ వికెట్ అనే చెబుతున్నారు. క్యురేటర్ కూడా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని నిర్ధారించారు. సమీపంలోని ధౌలాదర్ కొండల్లో ఎప్పుడైనా వర్షం కురవొచ్చని అంచనా. చిన్నపాటి జల్లులు వచ్చి ఆగినా...ఆ స్థితిని పేసర్లు ఉపయోగించుకోవచ్చు.
ఆటగాళ్లతో చర్చించేది లేదు!
కింగ్స్టన్: వెస్టిండీస్ క్రికెట్లో చెల్లింపులకు సంబంధించి ఏర్పడ్డ సంక్షోభంలో ఆటగాళ్లను నిరాశపరిచే నిర్ణయం విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) తీసుకుంది. ఈ అంశంలో తాము కేవలం ప్లేయర్స్ అసోసియేషన్‌తో చర్చిస్తామని, నిరసనకు దిగిన ఆటగాళ్లతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందంలో ఉన్న నిబంధనల మేరకే మేం మధ్యవర్తిత్వం వహిస్తాం. దీనిని మీరు గౌరవించాలి. ఈ అంశంలో మరో మాటకు తావు లేదు’ అని విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్... జట్టు కెప్టెన్ డ్వేన్ బ్రేవోకు లేఖ రాశారు.