అక్షత్ సూపర్ సెంచరీ
132 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 154
మెరిసిన సుమంత్, మిలింద్
సౌరాష్ట్రపై హైదరాబాద్ భారీ విజయం
విజయ్ హజారే క్రికెట్ టోర్నీ
కోల్‌కతా: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగాల్ క్రికెట్ అకాడమీ మైదానంలో సౌరాష్ట్ర జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 113 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న అక్షత్ రెడ్డి (132 బంతుల్లో 154; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అక్షత్ వన్డేల్లో హైదరాబాద్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (161; గోవాపై 1994లో) పేరిట ఈ రికార్డు ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 312 పరుగుల భారీస్కోరు చేసింది. కె. సుమంత్ (106 బంతుల్లో 91 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కొద్దిలో సెంచరీని కోల్పోయాడు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (7) త్వరగానే ఔటైనా... అక్షత్, సుమంత్‌లు కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీస్కోరును అందించారు. వీరిద్దరూ వేగంగా ఆడుతూ 191 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో అక్షత్ లిస్ట్ ఏ క్రికెట్లో 3వ సెంచరీని సాధించాడు. అనంతరం సుమంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో కెప్టెన్ బద్రీనాథ్ (18 బంతుల్లో 22; 2 ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 58 పరుగుల్ని జోడించాక శౌర్య బౌలింగ్‌లో అర్పిత్ వసవదకు క్యాచ్ ఇచ్చి బద్రీనాథ్ పెవిలియన్‌కు చేరాడు. తర్వాత కొద్దిసేపటికే అక్షత్ కూడా రనౌటవ్వగా... మెహదీ హసన్ (12), ఆకాశ్ భండారి (2), బావనాక సందీప్ (0), హిమాలయ్ అగర్వాల్ (3) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ప్రత్యర్థి బౌలర్లలో కుషంగ్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 313 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టు 38.5 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ప్రేరక్ మన్కడ్ (88 బంతుల్లో 104; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేశాడు. జయదేవ్ షా (34) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 4 వికెట్లతో చెలరేగగా... ఎం. రవికిరణ్, మెహదీ హసన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. సిరాజ్, ఆకాశ్ భండారీలకు తలా వికెట్ దక్కింది. బుధవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్ ఆడుతుంది.
స్కోరు వివరాలు
హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) దేశాయ్ (బి) ఉనాద్కట్ 7, అక్షత్ రెడ్డి రనౌట్ 154, కె. సుమంత్ రిటైర్డ్ హర్ట్ 91, ఎస్. బద్రీనాథ్ (సి) వసవద (బి) శౌర్య 22, మెహదీ హసన్ (సి) వసవద (బి) పటేల్ 12, ఆకాశ్ భండారీ రనౌట్ (ఉనాద్కట్) 2, బావనాక సందీప్ హిట్ వికెట్ (బి) పటేల్ 0, హిమాలయ్ అగర్వాల్ (సి) దేశాయ్ (బి) పటేల్ 3, సీవీ మిలింద్ నాటౌట్ 6, సిరాజ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 312.
వికెట్ల పతనం: 1–17, 2–266, 3–297, 4–297, 5– 298, 6–300, 7–311.
బౌలింగ్: జయదేవ్ ఉనాద్కట్ 10–1–44–1, శౌర్య 9–0–72–1, కుషంగ్ పటేల్ 10–0–54–3, ప్రేరక్ మన్కడ్ 3–0–20–0, డీఏ జడేజా 10–0–56–0, చిరాగ్ 7–0–51–0, అర్పిత్ వసవద 1–0–5–0.
సౌరాష్ట్ర ఇన్నింగ్స్: షెల్డన్ జాక్సన్ ఎల్బీడబ్ల్యూ (బి) రవికిరణ్ 5, అబ్రార్ షేక్ (సి) రవికిరణ్ (బి) మిలింద్ 4, హార్విక్ దేశాయ్ (సి) హసన్ (బి) భండారి 16, జయదేవ్ షా (సి) సందీప్ (బి) మిలింద్ 34, ప్రేరక్ మన్కడ్ (సి) సుమంత్ (బి) రవికిరణ్ 104, అర్పిత్ వసవద (సి) తన్మయ్ (బి) మిలింద్ 1, చిరాగ్ జాని (సి) సిరాజ్ 6, జయదేవ్ ఉనాద్కట్ (బి) హసన్ 0, శౌర్య ఎల్బీడబ్ల్యూ (బి) హసన్ 9, డీఏ జడేజా (సి) తన్మయ్ (బి) మిలింద్ 14, కుషంగ్ పటేల్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (38.5 ఓవర్లలో ఆలౌట్) 199.
వికెట్ల పతనం: 1–9, 2–11, 3–57, 4–67, 5–71, 6–95, 7–96, 8–132, 9–178, 10–199.
బౌలింగ్: ఎం. రవికిరణ్ 605–0–46–2, సీవీ మిలింద్ 9–1–30–4, సిరాజ్ 9–0–45–1, ఆకాశ్ భండారి 7–0–32–1, హసన్ 7–0–44–2.