ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది
సాక్షి, విజయవాడ : ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని ఏపీఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులు నష్టాల్లో నడుస్తున్నా సామాజిక బాధ్యతతో తిప్పుతున్నామని తెలిపారు. గత రెండు నెలలుగా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టామని, సెలవుల్లో విషయంలో ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బందిని సమకూర్చామని పేర్కొన్నారు. దాదాపు 20,200 మందికి పెన్షన్లు పెండింగ్లో ఉన్న విషయం గుర్తించామన్నారు. కార్మికులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని, జూన్ నెలలో రిటైరయ్యే వారికి అదేరోజున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ఆదేశించానని సురేంద్రబాబు అన్నారు.
పాత బకాయిలు క్లియర్ చేసే పనిలో ఉన్నాం..
పాత బకాయిలు క్లియర్చేసే పనిలో ఉన్నామని సురేంద్రబాబు తెలిపారు. కార్మికులను చార్జిమెమోలతో వేధించే విధానానికి స్వస్తి పలికి సరికొత్త విధివిధానాలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా వేళలు మార్చడంద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందన్నారు. విద్యార్థుల బస్పాస్లను నెలవారీ కాకుండా త్రైమాసికం, వార్షిక విధానానికి వెసులుబాటు కల్పించామన్నారు. రెండు వందల కోట్లతో 850 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, డిమాండ్ ఉన్న రోజుల్లో టికెట్ల ధరలు పెంచుతామని పేర్కొన్నారు. పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి భారంగా మారాయని, టికెట్ల ద్వారానే కాకుండా ఇతన మార్గాల ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఆర్టీసీ స్థలాల్ని వాణిజ్యపరంగా వినియోగంలోని తీసుకువస్తామన్నారు.