ముడుపులు ఇచ్చే సంస్కృతి లేదు: ఎల్ అండ్ టీ
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు ప్రాజెక్టు దక్కించుకోవడానికి ఎవరికీ ముడుపులు ఇవ్వలేదని, అలాంటి సంస్కృతి తమది కాదని ఎల్ అండ్ టీ మెట్రో రైలు సీఈవో, ఎండీ వీఎన్ గాడ్గిల్ స్పష్టం చేశారు. తాము ముడుపులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ప్రాజెక్టు పురోగతిపై హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ పోటీని ఎదుర్కొని టెండర్‌ను దక్కించుకున్నామని తెలిపారు. 75 సంవత్సరాలుగా ఎన్నో ప్రతిష్ఠా త్మక ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశామన్నారు. టెండర్లో ఉన్న ప్రకారమే పనులు జరుగుతున్నాయని, భూములు అధికంగా కేటాయించలేదని తెలిపారు.
ఈ భూములను ఎల్అండ్టీకి ప్రభుత్వం లీజుకు మాత్రమే ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ దాదాపు రూ.15 వేల కోట్లు పెట్టుబడిగా పెడుతోందన్నారు. ఇప్పటివరకు రూ.3,100 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో సబ్‌కాంట్రాక్టులు ఇవ్వలేదని, అంతర్జాతీయంగా పేరున్న సంస్థలకే కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో పనులు అప్పగించామని వివరించారు. హైదరాబాద్ మెట్రో తరువాతే రియాద్‌లో రూ.8,500 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టును ఎల్ అండ్ టీ దక్కించుకున్న విషయాన్ని గాడ్గిల్ గుర్తు చేశారు. ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని, వారి ఎత్తులు సఫలం కావని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొదటి దశను 2014కు పూర్తి చేసి 2015 మార్చి 21న ఉగాదిరోజు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.