కర్ణాటక వోల్వో బస్సు దగ్ధం
గార్లదిన్నె (అనంతపురం): మరో వోల్వో బస్సు మంటల్లో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట క్రాస్ వద్ద హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి(ఎన్హెచ్-44)పై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కేఏ 01ఏపీ4114 నంబరు గల కర్ణాటకకు చెందిన వోల్వో బస్సు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న కాలికట్కు బయలుదేరింది.
ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తిమ్మంపేట క్రాస్ వద్దకు చేరుకోగానే బస్సులోని ఫైర్ అలారం మోగింది. వెంటనే డ్రైవర్ తిమ్మరాజు బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. అతను కిందకు దిగి బస్సు వెనుక వైపు వెళ్లి చూడగా అప్పటికే మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ గట్టిగా కేకలు వేయడంతో కొంతమంది ప్రయాణికులు నిద్రలేచి కిందకు దిగారు. మిగిలిన ప్రయాణికులను కూడా డ్రైవర్ నిద్రలేపి బస్సులో నుంచి కిందకు దించేశాడు. వారు దిగిన కొద్దిసేపటికే బస్సు మొత్తం దగ్ధమైంది.
డ్రైవరు అప్రమత్తంగా లేకపోతే తమ ప్రాణాలు మంటల్లో కలిసిపోయేవని ప్రయాణికులు వాపోయారు. విషయం తెలిసిన వెంటనే గార్లదిన్నె ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైరింజిన్కు ఫోన్ చేసి రప్పించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి సునీత
ఘటనా స్థలాన్ని మంత్రి పరిటాల సునీత ఆదివారం తెల్లవారుజామున పరిశీలించారు. విజయవాడ నుం చి అనంతపురం వెళుతూ మార్గమధ్యంలోని ఘటనా స్థలం వద్ద ఆమె ఆగారు. అధికారులతో మాట్లాడి అనంతపురం నుంచి మరో వోల్వో బస్సును రప్పించి ప్రయాణికులను గమ్యస్థానానికి పంపించారు.