Vote to crore case
-
వాస్తు ‘బాట’లో చంద్రబాబు
ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఆయన తన రాకపోకల దారి మార్చుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 24లోని తన అద్దె నివాసంలోని గేటు నం. 1 నుంచి వారం క్రితం వరకూ రాకపోకలు సాగించేవారు. అయితే ఈ దిశ వాస్తుకు విరుద్ధంగా ఉందని, అందుకే ‘ఓటుకు కోట్లు’లో ఇరుక్కుపోయారని వాస్తు పండితులు చెప్పడంతో వారం రోజుల నుంచి రూటు మార్చారు. గేటు నం. 1 నుంచి కాకుండా ఇప్పుడు గేటు నం. 2 నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు వాస్తు బాగా కుదిరిందని, వాస్తు దోషాలు పోయాయని పండితులు చెప్పడంతో ఇక నడక కూడా రెండో గేటు నుంచే మొదలు పెట్టారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పటివరకూ కుడివైపు తిరిగేవారు. ఇక నుంచి ఎడమ వైపునకు తిరిగి రాకపోకలు సాగించనున్నారు. - హైదరాబాద్ -
కిరికిరి చేస్తే ఊరుకోం
చంద్రబాబుకు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి సెక్షన్-8ని తెరపైకి తెచ్చారని, ఇలాంటి కిరికిరిలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 10వ షెడ్యూల్లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో ఏపీ అధికారిని నియమించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. 9వ షెడ్యూలోని 85 సంస్థలను విభజించకుండా బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విధి విధానాలకు, హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాబు వ్యవహరిస్తూ ఏపీ-తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకోవాలని బాబు చూస్తున్నారని ఆరోపించారు.