
కిరికిరి చేస్తే ఊరుకోం
చంద్రబాబుకు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి సెక్షన్-8ని తెరపైకి తెచ్చారని, ఇలాంటి కిరికిరిలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 10వ షెడ్యూల్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో ఏపీ అధికారిని నియమించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
9వ షెడ్యూలోని 85 సంస్థలను విభజించకుండా బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విధి విధానాలకు, హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాబు వ్యవహరిస్తూ ఏపీ-తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకోవాలని బాబు చూస్తున్నారని ఆరోపించారు.