voting Percent
-
‘గ్రేటర్’ ఫైనల్ ఓటింగ్ శాతం ప్రకటించిన ఈసీ
సాక్షి, హైదరాబాద్ : బల్దియా ఎన్నికల్లో తుది ఓటింగ్ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 149 డివిజన్లలో పోలింగ్ జరగగా 46.68 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యధికంగా కంచన్‌బాగ్‌లో 70.39 శాతం నమోదు కాగా, అత్యల్పంగా 32.99శాతం పోలింగ్ యూసప్‌గూడలో నమోదైంది. కాగా గత 20 ఏళ్లలో జీహెచ్ఎంసీలో ఇదే అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. క్రితంసారి ఎన్నికల్లో (2016) 45శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్నిక ఆగిపోయిన ఓల్డ్ మలక్‌పేటలో గురువారం రీ-పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ఉండగా, సాయంత్రానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు బ్యాలెట్ బాక్స్‌లు పోలీసులు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లలో మూడంచెల భద్రత కొనసాగుతోంది. -
అన్నీ రికార్డులే!
జిల్లాలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్ల తీర్పు వరకు గతానికి భిన్నంగా సాగింది. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావటం అందులోనూ మహిళా ఓటింగ్ పెరగటం, అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగటం, భారీ మెజార్టీ నమోదు కావటం, జిల్లా ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ల తీర్పు రావడం లాంటి కొత్త రికార్డులు నమోదయ్యాయి. కాకినాడ సిటీ: జిల్లాలో మొత్తం ఓటర్లు 42,04,436 మంది ఉండగా ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 33,63,352 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో జిల్లావ్యాప్తంగా పోలింగ్ నమోదు కాగా 80 శాతం, 2014లో 74.24 శాతం నమోదైంది. అనపర్తి నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 85.74 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 87.48 శాతం నమోదైంది. రాజమహేంద్రవరం సిటీ 2014లో 65.28 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 87.47 శాతం, మండపేట నియోజకవర్గంలో 2014లో 82.26 శాతం 2019 ఎన్నికల్లో 85.52 శాతం, కొత్తపేట నియోజకవర్గంలో 2014లో 80.47 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 84.30 శాతం, రామచంద్రపురం నియోజకవర్గంలో 2014లో 80.67 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 87.11 శాతం, జగ్గంపేట నియోజకవర్గంలో 2014లో 78.71 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 85.86 శాతం నమోదైంది. భారీ మెజార్టీలు 2019 ఎన్నికల్లో అనపర్తి, తుని, పిఠాపురం, అమలాపురం, జగ్గంపేట, రాజానగరం, కాకినాడ సిటీ, పి.గన్నవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో గెలుపొందిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 10వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అనపర్తి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గెలుపొందిన సత్తి సూర్యనారాయణరెడ్డి సమీప ప్రత్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై 55,207 ఓట్ల ఆధిక్యత సాధించారు. తుని వైఎస్సార్ సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా 24,016 ఓట్లు, కాకినాడ సిటీ అభ్యర్థి 14,111 ఓట్లు, అమలాపురం అభ్యర్థి పినిపే విశ్వరూప్ 25,654 ఓట్లు, పిఠాపురం అభ్యర్థి పెండెం దొరబాబు 14,992 ఓట్లు, రంపచోడవరం అభ్యర్థి నాగుల పల్లి ధనలక్ష్మి 39,106 ఓట్లు, పి.గన్నవరం అభ్యర్థి కొండేటి చిట్టిబాబు 22,257 ఓట్లు, రాజానగరం అభ్యర్థి జక్కంపూడి రాజా 31,712 ఓట్లు, జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల చంటిబాబు 23,365 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నోటాకు పెరిగిన ఓట్లు ఈసారి ఎన్నికల్లో నోటాకు ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. తుని 2,927, ప్రత్తిపాడు 2,105, పిఠాపురం 2,595, పెద్దాపురం 2,292, జగ్గంపేట 3,626, అనపర్తి 2,708, రాజానగరం 2,857, రాజమహేంద్రవరం రూరల్ 2,211, రామచంద్రపురం 2,007, ముమ్మిడివరం 2,816, అమలాపురం 2,357, పి.గన్నవరం 3,020, కొత్తపేట 2,395, మండపేట నియోజకవర్గంలో 2,086 వంతున ఓట్లు నోటాకు వచ్చాయి. అర్ధరాత్రి వరకు వరుసలోనే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో 193 నియోజకవర్గాల్లోని ఈవీఎంలు మొరాయిం చాయి. జిల్లాలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు, పిఠాపురం, తుని, జగ్గంపేట, రాజానగరం, మండపేట తదితర నియోజకవర్గాల్లో సుమారు 112 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కన్పించారు. ఓటింగ్‌లో మహిళలదే ఆధిక్యం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌లో మహిళలు ఆధిక్యత చాటుకున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లు 21,23,332 మంది ఉండగా వీరిలో 16,69,578 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాకినాడ సిటీలో నియోజకవర్గంలో 1,32,327 మంది మహిళలు ఉండగా 87,552 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాజోలులో 93,787 మంది మహిళలుండగా 74,116 మంది, రాజమహేంద్రవరం సిటీలో 1,30,734 మంది ఉండగా 86,474 మంది, రాజమహేంద్రవరం రూరల్‌లో 1,29,450 మంది మహిళా ఓట్లు ఉండగా 94,676, మండపేట నియోజకవర్గంలో 1,09471 మంది మహిళా ఓటర్లు ఉండగా 92,920 మంది ఓట్లు వేశారు. మూడుకు మూడు, 19కి 14 జిల్లా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు తీర్పు వెల్లడించారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాలుండగా మూడింటిని వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. నాలుగు స్థానాలతో టీడీపీ సరిపెట్టుకోవల్సి వచ్చింది. జనసేనకు ఒకటి దక్కింది. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది ఎక్కువే జిల్లాలో గత ఎన్నికల సందర్భంగా అధికారులు, సిబ్బంది నియామకం కొంత పరిమితంగా ఉండేది. ఈసారి గతానికి కంటే భిన్నంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బందిని ఎక్కువగా నియమించారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో మొత్తం 36,534 మంది సిబ్బందిని నియమించారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు కూడా ఈ ఎన్నికల్లో విధులు కేటాయించారు. అధికారుల సస్పెన్షన్లూ అధికమే ఈ ఎన్నికల్లో గతంలో లేనివిధంగా అధికారులు, సిబ్బంది, సస్పెన్షన్లు కొనసాగాయి. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ఈవీఎంల మొరాయింపు వ్యవహారం, వీవీప్యాట్ల వ్యవహారంలో మొత్తం 9 మందిపై చర్యలు తీసుకున్నారు. -
ఏపీలో పెరిగిన పోలింగ్
-
ఈసారైనా పెరిగేనా?
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ మహా నగరంలో నేడు జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల లోక్‌సభ స్థానాల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదులో హైదరాబాద్ నగరం అట్టడుగుకు పడిపోయింది. దీంతో ఎన్నికల యంత్రాంగం పోలింగ్ శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో మొబైల్ బృందాల ద్వారా అవగాహన కల్పించారు. చైతన్యమిలా.. మహిళలు, యువత, కాలేజీ విద్యార్థులు, రెసిడెంట్ వేల్పేర్ అసోసియేషన్లు, వయోవృద్ధులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంటింటికీ పోల్ స్లిప్‌లు పంపిణీ చేశారు. ఓటు వేయాల్సిందిగా కోరుతూ తెలుగు, ఇంగ్లిష్ ఉర్దూ భాషల్లో ముద్రించిన కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఆస్తిపన్ను చెల్లించే వారి సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపించారు. ఓటరు తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకునేందుకు మై జీహెచ్ఎంసీ యాప్‌లో నేవిగేషన్ సదుపాయం కల్పించారు. ప్రముఖుల ఓట్లు గల్లంతు కాకుండా బీఏల్ఓల ద్వారా పరిశీలన చేయించారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం పోలింగ్ కేంద్రం ఎలా ఉంటుంది. అక్కడ ఎవరు ఏం చేస్తారు. ఓటు ఏలా వేయాలి తెలిసేలా ‘చునావ్ పాఠశాల’ పేరిట అవగాహన కల్పించారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల ఏర్పాటుతోపాటు వీల్చైర్లు, సహాయకులు అందుబాటులో ఉంచేవిధంగా చర్యలు చేపట్టారు. వాదా యాప్ ద్వారా కోరుకున్న వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. పోలింగ్ ఒక రోజు ముందు అంటే బుధవారం ప్రతి ఓటరుకు ఓటు హక్కు వినియోగించుకోమంటూ మొబైల్ నెంబర్ ‘పోలింగ్ స్టేషన్ నంబర్, కాలనీ, ఓటరు సీరియల్ నంబర్, ప్రదేశం’తో కూడిన సంక్షిప్త సమాచారం చేరవేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోపోలింగ్ ఇలా... ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.89 శాతం నమోదైంది. చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్లో 40.18 శాతం, పోలింగ్ అత్యల్పంగా నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లిలో 48.51 శాతం, మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ సెగ్మెంట్లో పోలింగ్ 51.54 శాతానికి పరిమితమైంది. అత్యల్పంగా నమోదైనప్పటికి పురుషులతో సమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో పురుషులతో సమానంగా పోలింగ్‌లో పాల్గొనగా, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్పురాలలో మహిళలు తక్కువగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. 15 చోట్ల అత్యల్ప పోలింగ్ గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల అతి తక్కువ పోలింగ్ నమోదైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల కోసం అధికారులు ఆరు రోజుల పాటు పోలింగ్ కేంద్రాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అక్కడ మొబైల్ వాహనాల ద్వారా ప్రచారంతోపాటు అవగాహనకార్యక్రమాలు నిర్వహించారు. ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. చాలామంది పోలింగ్ రోజున ఓటు వేసేందుకు సెలవు ఇచ్చినా..పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంలేదు. ఈసారి గురువారం పోలింగ్ కాగా శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే ఆ తర్వాత వరుసగా రెండో శనివారం, ఆదివారాలు సెలవు. ఈ నేపథ్యంలో పోలింగ్ తగ్గే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 20 నుంచి 39 శాతమే ఓటింగ్జరగడం గమనార్హం. -
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహిస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం గంటసేపు పెరగడంతో జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 50శాతం ఓట్లు పోలయ్యాయని, ఈ దఫా కనీసం 70శాతం ఓట్లు పోలయ్యేలా చూస్తామని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని వర్గాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నామన్నారు. రెండున్నర నెలలుగా నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా కొత్తగా 3.47 లక్షల ఓట్లు జాబితాలో చేరాయని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ శ్రీధర్ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు నగర శివారు గ్రామ పంచాయతీల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని, ఇదే తరహాలో సాధారణ ఎన్నికల్ని కూడా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 సెగ్మెంట్లలో డబుల్ ఈవీఎంలు.. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 330 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీటిలో 10 సెగ్మెంట్లలో 15కు మించి అభ్యర్థులుండడంతో అక్కడ రెండో ఈవీఎంలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో జిల్లాకు అదనంగా ఆరు వేల ఈవీఎంలు అవసరమని ఎన్నికల సంఘానికి లేఖ రాశాం. ఈసీఐఎల్ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే అదనపు ఈవీఎంలు జిల్లాకు చేరుతాయి అని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,469 పోలింగ్ కేంద్రాలుండగా.. ఓటర్ల సంఖ్య ఆధారంగా మరో 573 పోలింగ్ కేంద్రాలు అవసరమని ఎన్నికల సంఘానికి సూచించామని, దీనికి ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపిందని చెప్పారు. దీంతో జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 5,042 కు చేరిందన్నారు. 1,600 ఓటర్ల కంటే ఎక్కువున్న పోలింగ్ కేంద్రానికి అదనపు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా పోలింగ్ రోజు విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని, ఇందుకు సంబంధిత ఉన్నతాధికారి నుంచి లేఖ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లను నియోజకవర్గంలో ఒక చోట ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామన్నారు. అనంతరం ఓటువేసి బాక్సులో వేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్లకు పోలింగ్‌కు ముందే ఓటర్ స్లిప్పులు అందిస్తున్నామని, ఈ స్లిప్పులు చూపిస్తే ఇతర గుర్తింపు కార్డులు చూపించాల్సిన పనిలేదని అన్నారు. పోలింగ్‌బూత్‌ల వారీగా ప్రత్యేక తేదీలు ప్రకటించి ఓటర్ స్లిప్పులు బూత్‌స్థాయి అధికారుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రాంతమే లక్ష్యంగా.. జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన కనిపించిందని కలెక్టర్ తెలిపారు. అయితే శివారు పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు నిరాసక్తత చూపారని, నిజాంపేటలో కేవలం 25శాతం మాత్రమే ఓటింగ్ జరగడం గమనార్హమన్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై మరింత చైతన్యపర్చాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, ఐటీ కార్యాలయాల వద్ద ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కనిష్టంగా 70శాతం పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లిక్కర్ డీలర్లకు గత ఏడాది ఇదే సమయంలో ఏమేరకు స్టాకు సరఫరా చేశామో.. ఇప్పుడు కూడా అంతే మోతాదులో స్టాకు ఇస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో 1500 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, డీఆర్వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.