సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ మహా నగరంలో నేడు జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల లోక్‌సభ స్థానాల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదులో హైదరాబాద్ నగరం అట్టడుగుకు పడిపోయింది. దీంతో ఎన్నికల యంత్రాంగం పోలింగ్ శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో మొబైల్ బృందాల ద్వారా అవగాహన కల్పించారు.
చైతన్యమిలా..
మహిళలు, యువత, కాలేజీ విద్యార్థులు, రెసిడెంట్ వేల్పేర్ అసోసియేషన్లు, వయోవృద్ధులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంటింటికీ పోల్ స్లిప్‌లు పంపిణీ చేశారు. ఓటు వేయాల్సిందిగా కోరుతూ తెలుగు, ఇంగ్లిష్ ఉర్దూ భాషల్లో ముద్రించిన కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఆస్తిపన్ను చెల్లించే వారి సెల్‌ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపించారు. ఓటరు తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకునేందుకు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో నేవిగేషన్ సదుపాయం కల్పించారు. ప్రముఖుల ఓట్లు గల్లంతు కాకుండా బీఏల్‌ఓల ద్వారా పరిశీలన చేయించారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం పోలింగ్ కేంద్రం ఎలా ఉంటుంది. అక్కడ ఎవరు ఏం చేస్తారు. ఓటు ఏలా వేయాలి తెలిసేలా ‘చునావ్ పాఠశాల’ పేరిట అవగాహన కల్పించారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల ఏర్పాటుతోపాటు వీల్‌చైర్లు, సహాయకులు అందుబాటులో ఉంచేవిధంగా చర్యలు చేపట్టారు. వాదా యాప్ ద్వారా కోరుకున్న వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. పోలింగ్ ఒక రోజు ముందు అంటే బుధవారం ప్రతి ఓటరుకు ఓటు హక్కు వినియోగించుకోమంటూ మొబైల్ నెంబర్ ‘పోలింగ్ స్టేషన్ నంబర్, కాలనీ, ఓటరు సీరియల్ నంబర్, ప్రదేశం’తో కూడిన సంక్షిప్త సమాచారం చేరవేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లోపోలింగ్ ఇలా...
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.89 శాతం నమోదైంది. చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 40.18 శాతం, పోలింగ్ అత్యల్పంగా నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లిలో 48.51 శాతం, మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ సెగ్మెంట్‌లో పోలింగ్ 51.54 శాతానికి పరిమితమైంది. అత్యల్పంగా నమోదైనప్పటికి పురుషులతో సమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో పురుషులతో సమానంగా పోలింగ్‌లో పాల్గొనగా, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురాలలో మహిళలు తక్కువగా ఓటుహక్కు వినియోగించుకున్నారు.
15 చోట్ల అత్యల్ప పోలింగ్
గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల అతి తక్కువ పోలింగ్ నమోదైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల కోసం అధికారులు ఆరు రోజుల పాటు పోలింగ్ కేంద్రాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అక్కడ మొబైల్ వాహనాల ద్వారా ప్రచారంతోపాటు అవగాహనకార్యక్రమాలు నిర్వహించారు. ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. చాలామంది పోలింగ్ రోజున ఓటు వేసేందుకు సెలవు ఇచ్చినా..పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంలేదు. ఈసారి గురువారం పోలింగ్ కాగా శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే ఆ తర్వాత వరుసగా రెండో శనివారం, ఆదివారాలు సెలవు. ఈ నేపథ్యంలో పోలింగ్ తగ్గే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 20 నుంచి 39 శాతమే ఓటింగ్‌జరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment