మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా, కర్ణాటక గవర్నర్‌గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్‌గా కళ్యాణ్ సింగ్ నియమితులయ్యారు.
నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైల్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. అయితే బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఓ సారి కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న కె.శంకర నారాయణన్ మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మిజోరాం గవర్నర్ గా వెళ్లేందుకు శంకర నారాయణన్ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. దాంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. శంకర్ నారాయణన్ రాజీనామా చేసిన రెండు రోజులకు కొత్త గవర్నర్ ను నియమిస్తు రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.