ఏసీబీ వలలో మానిరేవు వీఆర్వో
రూ.3 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం
కళ్యాణదుర్గం : పట్టాదారు పాసు పుస్తకంలో భూమి వివరాలు, సర్వే నెంబర్ సరిదిద్దడం కోసం రూ.3 వేలు లంచం తీసుకుంటూ మానిరేవు ఇన్చార్జ్ వీఆర్ఓ నాగిరెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి కథనం మేరకు.. కళ్యాణదుర్గం మండలం చాపిరి రెగ్యులర్ వీఆర్ఓగా పని చేస్తున్న నాగిరెడ్డి మానిరేవు గ్రామానికి ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాల వెంకటాపురం గ్రామానికి చెందిన వన్నూర్‌స్వామి అనే రైతుకు మానిరేవు రెవెన్యూ పరిధిలో పొలం ఉంది.
ఎనిమిదేళ్ల క్రితం అప్పటి తహశీల్దార్ పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేశారు. రైతుకు సంబంధించిన సర్వే నెంబర్ 514-3లో 1.76 ఎకరాల పొలం ఉండగా అప్పటి రెవెన్యూ అధికారులు సదరు రైతు పేరుతో సర్వే నెంబర్ 587-2బీలో 2.61 ఎకరాల పొలం ఉన్నట్లు తప్పుగా నమోదు చేశారు. ఈ తప్పులను సవరించాలని బాధిత రైతు 2014 ఆగస్ట్ 25న అప్పటి తహశీల్దార్‌కు విన్నవించారు. ఆయన ఈ పనిని వీఆర్ఓ నాగిరెడ్డికి అప్పగించారు. తప్పులు సవరించేందుకు రూ.4 వేలు కావాలని వీఆర్వో డిమాండ్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత రూ.3 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ విషయూన్ని 9న (సోమవారం) ఏసీబీ అధికారులకు వివరించాడు. బుధవారం జయనగర్ కాలనీలో ఉన్న వీఆర్ఓ ఇంటి వద్దకు వెళ్లి రూ.3 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గురువారం నాగిరెడ్డిని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. దాడిలో ఏసీబీ కర్నూలు సీఐ సీతారామ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీకాంత్ నాయక్, అదే శాఖకు చెందిన రవీంద్ర పాల్గొన్నారు.