‘ఎన్కౌంటర్లు’ లేని తెలంగాణ కావాలి!
అభ్యర్ధన
ప్రజల ఆకాంక్షల్లోంచి ఉద్భ వించిన హక్కుల అంశంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనను మా ‘‘మానవ హక్కుల వేదిక’’ (హెచ్ఆర్ఎఫ్) బలపరి చింది. ప్రజలతో గొంతు కలిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి హక్కుల భాషలో మాట్లాడింది. తెలంగాణ ఉద్యమంపై అమలైన నిర్బంధాన్ని ఎప్పటిక ప్పుడు నిజనిర్ధారణ చేసి ఎలుగెత్తి ఖండించింది. ఆ ఉద్యమం సందర్భంగా వెలువడ్డ ప్రజల ఆకాంక్షల్లో... నక్సలైట్ల అణచివేత కోసం ప్రభుత్వాలు విధానపరంగా ఎంచుకునే పద్ధతుల వల్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంశం విస్పష్టంగా వ్యక్తమైంది.
నిర్భయం గా, స్వేచ్ఛగా ప్రజలు తమ ప్రాథమిక, పౌర హక్కులను అనుభవించే పరిస్థితులు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో నెలకొనాలని ప్రజలు గాఢంగా కాంక్షించారు. ఉద్యమ నాయకులు కూడా అటువంటి వాతావరణం ఏర్పడా ల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అందుకు భరోసా ఇస్తూ మాట్లాడారు. కానీ గతంలో ఉన్న పరిస్థితులే కొన సాగడం, నక్సలైట్లను అణచివేయడానికి ఎన్కౌంటర్ల పద్ధతిని కొనసాగించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుం ది. ప్రజల ఆకాంక్షలను, మా సంస్థ అభిప్రాయాలను తెలుపుతూ ఈ విషయంపై నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసు కోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాస్తున్నాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్కౌంటర్’ హత్యలు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా జరి గాయి. బ్రహ్మానందరెడ్డి, వెంగళరావులు సీఎంలుగా ఉన్న పదకొండేళ్లలో 350 మంది నక్సలైట్ కార్యకర్త లను ఎన్కౌంటర్లలో కాల్చివేశారు. 1979-80లో చెన్నా రెడ్డి గారు సీఎంగా ఉండగా ఎన్కౌంటర్లు వద్దని ఆదేశిం చడంతో ఆగిపోయాయి. ఆ తర్వాత అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి కాలంలో పెద్దగా ఎన్కౌంటర్లు జరగలేదు.
ఎన్కౌంటర్లు అసలే ఉండొద్దన్న ఎన్టీఆర్ సీఎంగా ఉండగా కొన్ని మాత్రమే జరిగాయి. 1989లో చెన్నారెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్ కౌంటర్లు కూడదనటంతో జరగలేదు. 1992-94 మధ్య సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఎన్కౌంటర్లు చేయడా నికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో 340 మందిని కాల్చి వేశారు. రెండోసారి ఎన్టీఆర్ తొమ్మిది నెలల పాలన తర్వాత ముఖ్యమంత్రయిన చంద్రబాబు నాయుడు ఎన్ కౌంటర్లను విధానపరంగా పూర్తిగా సమర్థించాడు. ఆయ న పాలించిన 8 సంవత్సరాల 8 నెలల్లో 1,448 మందిని ఎన్కౌంటర్ల పేరుతో కాల్చేశారు. ఈ హత్యాకాండ స్పష్ట మైన ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగింది. ఎన్కౌంటర్ హత్యలు చేసిన పోలీసు అధికార్లకు ప్రమోషన్లు, డబ్బు రూపేణా పారితోషికం ఇచ్చారు. దీంతో పోలీసులు ప్రైవేట్ గ్యాంగులకు ఆయుధాలిచ్చి హక్కుల సంఘం కార్యకర్తలపైన, ప్రజాసంఘాల కార్యకర్తలపైన, వామ పక్ష సానుభూతిపరులపైన దాడులే కాదు, హత్యలు కూడా చేయించారు. ఇవన్నీ పూర్తి చట్టవిరుద్ధంగా, ఒక పాలనా విధానంలో భాగంగా జరిగాయి.
ప్రజల హక్కుల, ఆకాంక్షల నేపథ్యంలో ఏర్పడ్డ నూతన తెలంగాణ రాష్ట్రం దాన్ని పాలించే ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు, జవాబుదారీ తనానికి కట్టుబడి ఉం డాలని హక్కుల సంఘంగా మేము కాంక్షిస్తున్నాం. చట్ట బద్ధ పాలన ద్వారా మాత్రమే ప్రభుత్వానికి ప్రజలను పాలించే నైతిక సాధికారత లభిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం. గత ప్రభుత్వాలు నక్సలైట్ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగానే పరిగణించి నక్సలైట్ కార్య కర్తలను, సానుభూతిపరులను భౌతికంగా నిర్మూ లించడాన్ని ఒక పాలనా విధానంగా అమలు పరచాయి. గత 45 ఏళ్లుగా హక్కుల ఉద్యమం నక్సలైట్ ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగానే భావిస్తోంది, అదే ప్రభు త్వాలకూ చెబుతోంది. నక్సలైట్ పార్టీలు హింసకు పాల్ప డినప్పటికీ దానిని రాజకీయ ఉద్యమంగానే చూడాలని ప్రభుత్వాలకి స్పష్టం చేస్తూ వస్తోంది. నక్సలైట్ పార్టీల హింసను చూస్తూ ఊరుకోవాలన్నది మా వైఖరి కాదు. పోలీసులు విధిగా స్పందించాలి. అయితే పోలీసులు చేపట్టే చర్యలేవైనా రాజ్యాంగం నిర్దేశించిన చట్టపరిధిలో ఉండాలి.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మూడు ఎన్ కౌంటర్లలో 8 మంది (రంగారెడ్డి జిల్లాలో పారిపోతు న్నాడన్న నెపంతో నేర చరిత్ర కలిగిన ఒక దొంగ, ఆలేరు ఎన్కౌంటర్లో గొలుసులతో వ్యాన్‌లోని సీట్లకు కట్టేసిన ఐదుగురు ముస్లిం యువకులు, వరంగల్ ఏటూరు నాగారం అడవుల్లో ఒక మహిళ సహా ఇద్దరు మావో యిస్టు కార్యకర్తలు) మరణించారు. పోలీసు లాకప్పుల్లో 6 (ఒక దళిత మహిళ సహా) అనుమానాస్పద మరణాలు జరిగాయి. జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్ర హైకోర్టు నిర్దేశించిన సూచనల మేరకు ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 ప్రకారం కేసులు పెట్టి, స్వతంత్ర నేర పరిశోధన విభాగం చేత విచారణ సాగిం చడాన్ని ఈ ప్రభుత్వం కూడా చేయడం లేదు.
కొత్త రాష్ట్రంలో నక్సలైట్లను అణచివేసే విషయంలో పాత విధానాలే కొనసాగించడం పట్ల హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలని పౌర, మానవ హక్కులకు భరోసా కల్పిం చాలని మేం కోరుకుంటున్నాం. పైన వివరించిన నేప థ్యం వెలుగులో తెలంగాణ రాష్ట్రంలో ‘‘ఎన్కౌంటర్ హత్యల ప్రక్రియ’’ఉండదనే పాలనాపరమైన విధానాన్ని నిర్దిష్టంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
- వి.ఎస్.కృష్ణ, ప్రధాన కార్యదర్శి
ఎన్.జీవన్‌కుమార్, అధ్యక్షులు, మానవ హక్కుల వేదిక