నిర్భయ చట్టంలో సారం లేదు: వి. సంధ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహిళల రక్షణకు చేసిన నిర్భయ చట్టంలోని అంశాలు ఆశాజనకంగా లేవని, జస్టిస్ వర్మ చేసిన ప్రధాన సిఫారసులను పక్కనపెట్టి సారం లేని చట్టాన్ని తయారు చేశారని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) ఆరోపించింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని నియంత్రించాలని, డిఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పీవోడబ్ల్యూ 6వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ముగిసాయి. మహాసభల చివరిరోజు సోమవారం సంస్థాగత కార్యక్రమాలపై చర్చించి పలు నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. మహిళా ఉద్యమాలతో సాధించుకున్న 498ఏ చట్టాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని, అలాంటి ఆలోచనను విరమించుకుని వరకట్న వేధింపులు, హత్యల నిరోధానికి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తీర్మానించారు.
మత రాజకీయాలు ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం కల్పించుకోకూడదని, ఆదివాసీ మహిళల ఉపాధి, నివాస హక్కులను పరిరక్షించే 5వ షెడ్యుల్‌ను అమలు చేయాలని, అటవీ భూములపై ఆదివాసీలకే హక్కులు కల్పించాలని, బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కుగా గుర్తించాలని, స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రెండు కమిటీలు వేయాలనే ప్రతిపాదనకు మహాసభలో ప్రతినిధుల నుంచి ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్టు సమాచారం. అయితే గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు రెండు కమిటీలకు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పూర్తి స్థాయి కమిటీని మంగళవారం ప్రకటించనున్నారు. మహాసభలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య, ప్రధాన కార్యదర్శి విష్ణు, రాష్ట్రనేతలు బి.పద్మ, నర్సక్క, రమాసుందరి, సూర్యకుమారి, అనురాధ పాల్గొన్నారు.