వీఎస్పీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలి
కారేపల్లి, న్యూస్‌లైన్: ఉద్యోగాలు ఇస్తామంటూ ఆశ చూపి రైతుల వ్యవసాయ భూములను విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) యాజమాన్యం లాక్కుని, వారిని కూలీలుగా మార్చిందని వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే (టీఆర్ఎస్) డాక్టర్ తాటికొండ రాజయ్య విమర్శించారు. మాధారం డోలమైట్ మైన్ ముందు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన భూనిర్వాసితులకు ఆయన బుధవారం సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మాధా రం రెవెన్యూ పరిధిలో 227 మందికి చెందిన 927 ఎకరాలను రైతుల నుంచి వీఎస్పీ లాక్కుని, కూలీలుగా మార్చిందని విమర్శించారు.
నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసగిస్తున్న వీఎస్పీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆం ధ్రకు తరలిస్తున్న డోలమైట్ ఉత్పత్తిని అడ్డుకుంటామని హెచ్చరించారు. మాధా రం మైన్ ద్వారా మండలానికి రావాల్సిన రాయల్టీని వీఎస్పీ యాజమాన్యం విస్మరించిందని విమర్శించారు. నాణ్యమైన డోలమైట్‌ను అందిస్తున్న మాధారం గ్రామాన్ని దత్తత తీసుకోకపోవడం దాని దుర్మార్గానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తెలంగాణ ఖనిజ సంపదను కొల్లగొడుతూ, ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించిన ఆంధ్ర పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత భూనిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేత ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్ళినట్టు చెప్పారు.
అనంతరం.. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌కు ఫోన్ చేసి భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నాయకులు దేవీలాల్, బొమ్మెర రామ్మూర్తి, సోమందుల నాగరాజు, చందూనాయక్, కడారి వెంకట్, వీర్యానాయక్, పెద్దబోయన సురేష్ తదితరులు పాల్గొన్నారు.