ఏప్రిల్ 30...
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం తొలివిడత ఏప్రిల్ 30న జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టయింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 2న కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ రోజునే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 10న పరిశీలన (స్క్రూట్నీ) ఉంటుంది. ఉపసంహరణకు ఏప్రిల్ 12 వరకు అవకాశమిస్తారు. ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. మే 16న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
2,259 పోలింగ్ స్టేషన్లు...
ఈ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 19,71,797 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 9,75,432 మంది మహిళలు, 9,96,254 మంది పురుషులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 2,259 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. 16 వేల బ్యాలెట్ యూనిట్ యంత్రాలు, 10,200 కంట్రోల్ యూనిట్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా అదనంగా యంత్రాలను తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.
భద్రాచలం డివిజన్లో ఆరు పోలింగ్సెంటర్లలో శాటిలైట్ ద్వారా ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నారు. భద్రాచలం డివిజన్లో ఎన్నికల నిర్వహణ నిమిత్తం హెలికాప్టర్‌ను ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ ఎన్నికల్లో ఓటర్లకు ఫొటో స్లిప్‌లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను సైతం వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.16 లక్షలు, ఎంపీ అభ్యర్థులు రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. అత్యవసర సర్వీసులు మినహా మిగతా సిబ్బంది అందరూ ఎన్నికల నిర్వహణలో పాల్గొనాలని జేసీ కడవేరు సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు.
ఎన్నికల అధికారుల నియామకం...
ఎన్నికలు సజావుగా నిర్వహించేం దుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల ఏర్పాట్లపై పలువురు అధికారులకు కలెక్టర్ విధులు అప్పగించారు. జిల్లా స్ధాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, డిప్యూటీ ఎన్నికల అధికారులుగా ఆర్డీవోలు వ్యవహరిస్తారు.
అధికార యంత్రాంగం సమాయత్తం...
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. అధికారులంతా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ఎలాంటి తప్పులకు తావివ్వవద్దని జేసీ సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా కలెక్టరేట్లోని పలు విభాగాల అధికారులతో కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టరేట్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. వీటి కోసం అధికారులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. 20 అంశాలపై బాధ్యతలు అప్పగించారు. వీరంతా అత్యవసర పనులు మినహా ఎన్నికల నిర్వహణపైనే ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.
ఎన్నికల నిర్వహణకు 12వేల మంది సిబ్బంది: జేసీ
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 12 వేల మంది సిబ్బంది అవసరం ఉంటుందని జేసీ సురేంద్రమోహన్ చెప్పారు. ఇప్పటి వరకు 9 వేల మందిని గుర్తించామని, మరో 3 వేల మందిని రెండు, మూడు రోజుల్లో గుర్తిస్తామని వివరించారు. మోడల్ కోడ్ కండక్ట్ నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఫ్లెక్సీలు, ఇతర ప్రచార బ్యానర్లను తొలగిస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని, ఎటువంటి కోడ్ ఉల్లంఘన జరిగినా ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియామావళిని పాటించాలని సూచించారు.