లలితంగా ప్రతిమను తీర్చిదిద్దుతూ..
కొత్తపేట : చెన్నైలో ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈఆర్ఐ) యూనివర్సిటీలో నెలకొల్పేందుకు తమిళనాడు దివంగత సీఎం జయలలిత విగ్రహాన్ని రూపొందించనున్నట్టు కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి, రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన శిల్పి డి.రాజ్కుమార్వుడయార్ తెలిపారు. వుడయార్ తన శిల్పశాలలో జయలలిత నమూనా విగ్రహానికి మంగళవారం తుదిమెరుగులు దిద్ది, పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుమారు మూడేళ్ల క్రితం చెన్నై సమీపంలోని వేలంచేరు పిల్లల ఆశ్రమంలో నెలకొల్పిన జయలలిత బస్ట్ విగ్రహాన్ని తానే రూపొందించానని తెలిపారు. ఆ విగ్రహం నమూనాకు నేడు తుది మెరుగులు దిద్ది సిద్ధం చేశానన్నారు. చెన్నై ఎంజీఆర్ ఈఆర్ఐ యూనివర్సిటీకి ఎంజీఆర్ విగ్రహం రూపకల్పనకు ఆ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ షణ్ముగం ఈ ఏడాది సెప్టెంబర్లో ఆర్డరిచ్చారని తెలిపారు. ఆ విగ్రహాన్ని వచ్చే జనవరిలో జయలలిత ఆవిష్కరించాల్సి ఉందని, ఆ సందర్భంగా తనకు సన్మానం ఏర్పాటుచేశారని తెలిపారు. అయితే ఈలోపు ఆమె మృతి చెందడం దురదృష్టకరమన్నారు.