ఏసీబీ పంజా
జన్నారం, న్యూస్‌లైన్ : అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. శుక్రవారం లక్ష్మీదేవి వస్తోందని భావించి కటకటాల పాలయ్యాడు. జన్నారం మండలం మరిమడుగు గ్రామ అసిస్టెంట్ వీఆర్వో లచ్చాగౌడ్ కొనుగోలు చేసిన భూమిని పహాణిలో రాసి, పట్టా ఇవ్వడం కోసం రూ.13 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మురిమడుగు గ్రామానికి చెందిన పందిరి రాజు, ఏరుగట్ల బుచ్చవ్వలు అదే గ్రామానికి సుగుణాకర్‌రావు వద్ద సర్వే నంబర్ 14లో గల 13 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఇదే భూమిని పహాణిలో తమ పేరు నమోదు చేసుకునేందుకు మార్చి 30న జరిగిన రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారి పేర్లు పహాణిలో నమోదు చేయకుండా అసిస్టెంట్ వీఆర్వో లచ్చాగౌడ్ ఏడు నెలలుగా కాలయాపన చేస్తున్నాడు. పట్టా చేయాలంటే రూ.17వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు రూ.13 వేలు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది.
ఈ విషయం బాదితురాలు పందిరి రాజు కుమారుడు పందిరి లింగన్నకు తెలుపడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం జన్నారం గ్రామ పంచాయతీలోని తన నివాసానికి రూ.13 వేలు తీసుకురావాలని లచ్చాగౌడ్ తెలుపడంతో లింగన్న డబ్బులను పట్టుకుని వచ్చాడు. లింగన్న నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం లచ్చాగౌడ్ ఇంటిలో సోదాలు జరిపి, ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఆదిలాబాద్ సీఐ మోహన్, కరీంనగర్ సీఐ వీవీ రమణమూర్తి , సిబ్బంది పాల్గొన్నారు.