VVIP Chopper Deal Case
-
విదేశీయుడని ఎన్నాళ్లు కస్టడీలో ఉంచుతారు?
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌ను విదేశీయుడన్న కారణంతో ఎన్ని రోజులు పోలీసు కస్టడీలో ఉంచుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అతను భారతీయుడు కాకపోవడంతో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉంచడం సమర్థనీయమా అని ప్రశ్నించింది. ఇది అతని స్వేచ్ఛను పూర్తిగా అణిచివేయడమేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పిఎస్.నరసింహలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. బ్రిటన్ జాతీయుడైన మైఖేల్‌ను దుబాయ్ 2018లో భారత్‌కు అప్పగించింది. అప్పట్నుంచి అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మైఖేల్ సుప్రీంలో సవాల్ చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం .. విదేశీయుడైనందుకు అతను అలాగే కస్టడీలో మగ్గిపోవాలా ? అని వ్యాఖ్యానించింది. మైఖేల్ జేమ్స్ అప్పగింత సమయంలో జరిగిన ఒప్పందం వివరాలన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2023 జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష -
‘దోషి అయితే ఆయనపై సానుభూతి ఉండదు’
న్యూఢిల్లీ: అగస్టా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న భారత మాజీ వైమానిక దళ చీఫ్ ఎస్పీ త్యాగి తమ కుటుంబ సభ్యుడులాంటి వాడేనంటూ వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత భారత వైమానిక దళ చీఫ్ అరూప్ రహా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అగస్టా స్కాంలో త్యాగి నిజంగానే దోషిగా తేలితే ఆయనపై తమకు ఎలాంటి సానుభూతి ఉండబోదని చెప్పారు. ‘వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి తమ కుటుంబంలో సభ్యుడే. అలాంటి వ్యక్తిపై కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెంట మేమంతా ఉంటాం. ఒక వేళ ఆయన దోషిగా తేలితే.. ఆయనపై ఇలాంటి సానుభూతి మాత్రం ఉండబోదు’ అని రహా చెప్పారు. ఎలాంటి ఆరోపణలు నిరూపితమూనా, ఎలాంటి శిక్షలు ఉన్నా తాము వాటికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఆర్మీ విషయంలో ఎవరూ తప్పుడు చర్యలకు పాల్పడినా అది చాలా చెడ్డపనిగానే భావిస్తామని, అందులో చిన్నాపెద్ద అనే తేడా ఉండదని అన్నారు.