మీ ఇంట్లో వ్యాంపింగ్ భూతం ఉందా?
ధోరణి
‘సెల్ జాగరణ’ అనే మాట కొత్తగా పుట్టుకొచ్చింది. దీన్నే ‘వ్యాంపింగ్’ పేరుతో పిలుస్తున్నారు. రాత్రంతా అవతలి వ్యక్తితో సెల్లో చాటింగ్ చేయడాన్ని స్థూలంగా ‘వ్యాంపింగ్’ అంటారు.
ముంబాయిలోని ఒక కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు సృజన్. రాత్రి పదింటికల్లా ఆరు నూరైనా సరే తన సెల్‌ఫోన్‌ను నాన్నకు అప్పగించాల్సిందే. ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న శిల్ప రాత్రి తొమ్మిదింటికల్లా తన సెల్‌ను తల్లికి అప్పగించాల్సిందే. ఇది కేవలం ముంబయి, ఢిల్లీలకే పరిమితమైన వ్యవహారం కాదు...చెప్పాలంటే మన దేశంలో చాలా నగరాల్లో తల్లిదండ్రులు తమ టీనేజి పిల్లల నుంచి రాత్రి పది లోపే సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని మరుసటి రోజు ఉదయం ఇస్తున్నారు.
ఎందుకిలా?
‘శవ జాగరణ’ అనే మాట మీరు వినే ఉంటారు. ఇప్పుడు ‘సెల్ జాగరణ’ అనే మాట కొత్తగా పుట్టుకొచ్చింది. దీన్నే ‘వ్యాంపింగ్’ పేరుతో పిలుస్తున్నారు. రాత్రంతా అవతలి వ్యక్తితో సెల్లో చాటింగ్ చేయడాన్ని స్థూలంగా ‘వ్యాంపింగ్’ అంటారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్స్ అప్, ఫోటోషేరింగ్, మెసేజ్‌లు...ఇలా రాత్రంతా ప్రతి దాన్నీ టచ్ చేయడం ‘వ్యాంపింగ్’లో భాగమే. ఈ ధోరణి టీనేజర్లలో అధికంగా ఉన్నట్లు రకరకాల సర్వేలు చెబుతున్నాయి.
మిగిలిన దేశాలతో పోల్చితే అమెరికాలో ‘వ్యాంపింగ్’ అధికంగా ఉంది.
‘నేషనల్ స్లీప్ ఫౌండేషన్’ అధ్యయనం ప్రకారం 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు చాలా తక్కువ నిద్ర పోతున్నారని తేలింది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. చదువు దెబ్బతింటోంది. ఈ ప్రమాదాన్ని గమనించిన తల్లిదండ్రులు ఇప్పుడిప్పుడే జాగ్రత్త పడుతున్నారు.