విండీస్ బోర్డుపై బీసీసీఐ కరుణ
రూ. 280 కోట్ల నష్టపరిహారం రద్దు
న్యూఢిల్లీ: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) చెల్లించాల్సిన దాదాపు రూ. 280 కోట్ల నష్టపరిహారంపై బీసీసీఐ వెనక్కి తగ్గింది. 2014లో డ్వేన్ బ్రేవో నేతృత్వంలోని విండీస్ వన్డే జట్టు అర్ధాంతరంగా సిరీస్ నుంచి తప్పుకుని స్వదేశానికి పయనమైంది. దీంతో తాము భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, నష్టపరిహారంగా 41.97 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా బీసీసీఐ డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడా మొత్తాన్ని రద్దు చేసుకుంది. ‘విండీస్ బోర్డుతో సమస్య పరిష్కారమైంది.
ఇప్పుడు గత సిరీస్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఆడేందుకు 2017లో విండీస్ జట్టు భారత్కు వస్తుంది. ఈ విషయంలో మేం కూడా సంతృప్తిగా ఉన్నాం. అందుకే పెనాల్టీని రద్దు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇక మేలో షెడ్యూల్ను ఖరారు చేస్తాం’ అని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు. మరోవైపు మనోహర్ చెప్పిన విషయాలకు తాము కట్టుబడి ఉన్నట్టు డబ్ల్యుఐసీబీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్ తెలిపారు.