వేతనాలు పెరగలేదు..తగ్గాయి
► కొత్త విధానంతో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని నష్టం
► తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకున్నప్పటికీ, వాస్తవానికి వారి వేతనాలు తగ్గాయని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీకి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు బలయ్యారని యూనియన్ అధ్యక్షులు వి.కుమారస్వామి, ప్రధాన కార్య దర్శి ఎస్.వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కె.సత్యం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైస్కిల్డ్ కార్మికుడికి రూ.23 వేలు, స్కిల్డ్ కార్మికుడికి రూ.19 వేలు, సెమీస్కిల్డ్ కార్మికుడికి రూ.16 వేలు, అన్స్కిల్డ్ కార్మికుడికి రూ.14 వేల వేతనం ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారని, అయితే, ఈ నాలుగు కేటగిరీల కార్మికులకు వాస్తవానికి వచ్చేది వరుసగా రూ.16,676, రూ.13,774, రూ.11,705, రూ.10,241ల వేతనం మాత్ర మేనన్నారు. విద్యుత్ సంస్థల యాజమాన్యా లు కట్టాల్సిన పీఎఫ్, ఈఎస్ఐల వాటాలనూ కార్మికుల వేతనాల నుంచి కోతపెట్టి చెల్లించే విధంగా కొత్త విధానాన్ని రూపొందిం చడంతో కార్మికుల చేతికి వచ్చే వేతనాలు భారీగా తగ్గిపోయాయన్నారు.
గతంలో చేసే పనిని బట్టి స్కిల్డ్ వేతనం పొందిన అనేక మంది తక్కువ చదువుకున్న కార్మికులు, చదువులేని కార్మికులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్టిజన్–4 కేటగిరీలోకి వెళ్లారన్నా రు. దీంతో రూ.15,870 వేతనం పొందు తున్న సీబీడీ గ్యాంగ్ వర్కర్లు, రూ.12,722 వేతనం పొందుతున్న చదువులేని స్కిల్డ్ వర్కర్ల వేతనం రూ.10,241కు తగ్గిపోయిం దన్నారు. పే రివిజన్ సందర్భంగా సంపాదిం చుకున్న 12 శాతం స్పెషల్ అలవెన్స్, జెన్కో లో డక్ట్ అలవెన్స్, షిఫ్టు అలవెన్స్లూ పోయా యన్నారు. విద్యుత్ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో జరుగుతున్న అన్యాయానికి నిర సనగా సెప్టెంబర్ 6న డిమాండ్ బ్యాడ్జీలు ధరించాలని, 12న టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని, 19న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.