వైఫల్యాలు కప్పిపుచ్చే ప్రయత్నాలు: సురవరం
న్యూఢిల్లీ: రుణమాఫీ హామీ అమలు చేయకుండా రైతుల దృష్టి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. రుణమాఫీకి సంబంధించి అనేక మెలికలు పెట్టడం సరికాదన్నారు. ఢిల్లీలో మూడు రోజులపాటు నిర్వహించిన సీపీఐ జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి.
సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు, భవిష్యత్తు కార్యచరణపై ఢిల్లీ అజయ్భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. రుణమాఫీపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రెండు చానళ్ల ప్రసారాలను ప్రభుత్వం మద్దతుతో నిలిపివేయడం ఆందోళనకరమన్నారు. అధిక ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అక్టోబర్ 16న ధర్నాలు చేపడతామన్నారు.