సంగీత దర్శకుడు వాజిద్ కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్–వాజిద్ (ఈ ఇద్దరూ అన్నదమ్ములు. వాజిద్ చిన్నవాడు) లలో ఒకరైన వాజిద్ ఖాన్ ఇక లేరు. 42 ఏళ్ల వాజిద్ కరోనా వైరస్ కారణంగా మరణించారు. అయితే కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో వాజిద్ ఇబ్బందిపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ (1998) చిత్రంతో సాజిద్–వాజిద్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
అప్పటినుంచి ఇద్దరూ కలిసి పని చేస్తూ వచ్చారు. ‘ప్యార్ కియాతో...’ తర్వాత మళ్లీ సల్మాన్ సినిమా ‘హలో బ్రదర్’కి సాజిద్–వాజిద్ సంగీతదర్శకులుగా చేశారు. అయితే ఈ చిత్రంలోని నాలుగు పాటలకు మాత్రమే స్వరాలందించారు. వాటిలో ‘ఏరియా కా హీరో’, ‘హతా సావన్ కీ ఘాటా..’ పాటలు ఉన్నాయి. సల్మాన్‌తో వాజిద్‌కి మంచి అనుబంధం ఉంది. సల్మాన్ నటించిన ‘తేరే నామ్’లోని ‘తూనే సాథ్ జో మేరా చోదా..’ పాట మంచి హిట్. అలాగే సల్మాన్ నటించిన ‘పార్టనర్’, ‘వాంటెడ్’, ‘వీర్’, ‘దబాంగ్’ తదితర చిత్రాలకు కూడా సాజిద్–వాజిద్ స్వరాలందించారు. ‘దబాంగ్’లోని ‘మున్నీ బద్నామ్ హుయి..’ పాట ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే.
సల్మాన్ ‘దబాంగ్ 2’, ‘దబాంగ్ 3’ చిత్రాలకూ వీరే స్వరకర్తలు. ఇంకా ఈ సంగీత ద్వయం పని చేసిన ఇతర హీరోల చిత్రాల్లో ఇమ్రాన్ హష్మి ‘ది కిల్లర్’, అక్షయ్ కుమార్‡ ‘హౌస్‌ఫుల్ 2’, ‘రౌడీ రాథోడ్’, టైగర్ ష్రాఫ్ ‘హీరో పంతి’ వంటివి ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో సల్మాన్ రూపొందించిన ‘భాయ్ భాయ్’, ‘ప్యార్ కరోనా’ పాటలకు కూడా వాజిద్ సంగీతం అందించారు. ‘‘నీ మీద ఉన్న ప్రేమ, గౌరవం ఎప్పటికీ తగ్గవు. ఎప్పటికీ గుర్తుండిపోతావ్ వాజిద్. నీ ప్రతిభను మిస్సవుతాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్, వరుణ్‌ధావన్, ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా, సోనమ్ కపూర్ తదితర బాలీవుడ్ సినీ ప్రముఖులు వాజిద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. వాజిద్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.