walmart mall
-
వాల్మార్ట్ స్టోర్లో కాల్పులు; కారణం అదే..!
టెక్సాస్ : ఎల్ పాసోలోని వాల్మార్ట్ స్టోర్లో శనివారం ఓ ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. తుపాకీతో స్టోర్లోకి ప్రవేశించిన పాట్రిక్ క్రూజియాజ్ (21) విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 20 మంది చనిపోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వర్ణ వివక్ష కారణంగానే నిందితుడు ఈ మారణహోమానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు 19 నిముషాల క్రితం నిందితుడు విడుదల చేసిన వీడియోలో విస్తుగొలిపే విషయాలు వెల్లడైనట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. దాని ప్రకారం.. వర్ణం ఆధారంగా అమెరికాను విభజించాలని.. తెల్లవారి స్థానంలో బయటి వ్యక్తులు అవకాశాలు తన్నుకుపోతున్నారని ఉన్మాది ఆగ్రహం వ్యక్తం చేశాడు. (చదవండి : అమెరికాలో కాల్పుల కలకలం.. 20 మంది మృతి) 51 మంది ప్రాణాలు బలిగొన్న న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ ఉన్మాదిని క్రూజియాజ్ ప్రశంసించాడు. అతని స్పూర్తిగానే కాల్పులకు తెగబడుటున్నట్టు చెప్పాడు. వర్ణ సంకరణం అమెరికా జన్యు విధానాన్ని నాశనం చేస్తోందని ‘ది ఇన్కన్వినెంట్ ట్రూత్’ పేరుతో అతను విడుదల చేసిన వర్ణ వివక్ష మేనిఫెస్టోపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు బ్లాక్ డ్రెస్లో ఉన్నట్టు సీసీ కెమెరాల ఆధారంగా బయటపడింది. 2017లో టెక్సాస్లోని చర్చిలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ఇదే పెద్దది. ఇదిలా ఉండగా.. ఓహియోలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ఘారత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.16 మంది గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు. -
రెండేళ్ల కొడుకు చేతిలో తల్లి హతం!
రెండేళ్ల వయసున్న కొడుకు పొరపాటున తన తల్లిని కాల్చిచంపేశాడు. ఈ ఘటన అమెరికాలోని వాల్ మార్ట్ మాల్లో జరిగింది. 29 ఏళ్ల మహిళ తన కొడుకు, మరో ముగ్గురు పిల్లలతో కలిసి షాపింగ్ చేస్తోంది. ఆమెకు ఆయుధాల లైసెన్సు ఉండటంతో ఓ స్మాల్ క్యాలిబర్ హేండ్ గన్ తన పర్సులో పెట్టుకుంది. ఆ పర్సును ఆమె తన షాపింగ్ ట్రాలీలో పెట్టుకుని వెళ్తుండగా.. ఆ రెండేళ్ల కొడుకు కూడా అదే ట్రాలీలో ఉన్నాడు. వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పొరపాటున ఆ హేండ్ గన్ నొక్కాడు. దాంతో తుపాకి పేలి.. నేరుగా ఆ ట్రాలీని తోసుకెళ్తున్న తల్లికి తగిలింది. ఉదయం 10.20 గంటలకు ఈ ఘటన జరిగే సమయానికి ఆమె భర్త ఆ మాల్ పరిసరాల్లో లేడు. కాల్పులు జరిగిన కొద్ది సేపటి తర్వాత వచ్చిన అతడు.. మిగిలిన పిల్లలను బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. ఇది చాలా బాధాకరమన ఘటన అని వాల్ మార్ట్ ప్రతినిధి బ్రూక్ బుచానన్ అన్నారు. ఇంతకుముందు పొరుగునుండే వాషింగ్టన్ రాష్ట్రంలో గత నవంబర్ నెలలో నాలుగేళ్ల అబ్బాయి మూడేళ్ల మరో కుర్రాడిని ఆడుకుంటూ పొరపాటున కాల్చేశాడు. అలాగే ఏప్రిల్లో కూడా ఫిలడెల్ఫియాలో రెండేళ్ల అబ్బాయి తన 11 ఏళ్ల అక్కను ఆడుకుంటూ తుపాకితో కాల్చి చంపేశాడు.