‘వాలీ’ దొరికిందోచ్!.. 22 రోజుల్లో 900 కిలోమీటర్లు ఈదేసింది
‘వాలీ’.. సముద్ర జలాల్లో తన విభిన్న చేష్టలతో ప్రఖ్యాతి గాంచిన వాల్రస్(ధ్రువపు జీవి). ఆర్కిటిక్ ప్రాంత సముద్ర జలాల్లో ప్రయాణించేవారికి ఇది సుపరిచితం. అయితే కొన్నిరోజుల కిందట అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో చాలా మంది జంతు ప్రేమికులు, పర్యాటకులు ఆందోళన చెందారు. వాలీ క్షేమంగా ఉండాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఎట్టకేలకు 22 రోజుల తర్వాత వాలీ ఆచూకీ లభించింది. 800 కిలోల బరువు ఉండే ఈ ప్రాణి.. 22 రోజుల్లో దాదాపు 900 కిలోమీటర్లు ఈదేసింది. చివరిసారిగా ఐర్లాండ్‌లో కనిపించిన వాలీ.. తిరిగి 22 రోజుల తర్వాత ఆదివారం ఐస్లాండ్ సమీపంలో దర్శనమిచ్చింది.
బ్రిటిష్ డైవర్స్ దాని శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా ‘వాలీ’ని నిర్ధారించారని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ తెలిపింది. ఈ 22 రోజులు చాలా ఆందోళన చెందామని.. మళ్లీ చూస్తామో లేదో అని భయపడ్డామని పేర్కొంది. ఎట్టకేలకు వాలీ ఆచూకీ లభించడం సంతోషంగా ఉందని వెల్లడించింది. అది తిరిగి తన స్వస్థలం ఐర్లాండ్‌కు వచ్చేందుకు ఈదడం మొదలుపెట్టిందని వివరించింది. వివిధ దేశాల మీదుగా దాదాపు 4,000 కిలోమీటర్లు ప్రయాణించి ఐర్లాండ్‌కు చేరుకుంటుందని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ అంచనా వేస్తోంది.
– సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్
చదవండి: ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు!
#WalrusWatch UPDATE: After 22 days with no confirmed sightings, we were starting to lose hope of ever seeing the young, wandering walrus again. HOWEVER, we just received notice that a similar-looking walrus was sighted yesterday in ICELAND..
Picture: Hafrún Eiríks / Höfn 1/7 pic.twitter.com/ZQLwGtbVol
— Seal Rescue Ireland (@seal_rescue) September 20, 2021