యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భూసేకరణ సమస్యలున్న చోట మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో పాల మూరు ప్రాజెక్టుపై హరీశ్‌రావు సమీక్షించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దనరెడ్డి, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సెక్రెటరీ వికాస్‌రాజ్, ఇతర అధికారులు, ఇంజనీర్లు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు ప్యాకేజీల సర్వే పనులు త్వరగా పూర్తి చేయడం కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇద్దరు అధికారులను డిప్యుటేషన్‌పై రప్పించాలని హరీశ్‌రావుకు ఎస్కే జోషి విజ్ఞప్తి చేశారు.
ఉదాసీనత వద్దు
భూసేకరణ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి కీలక అంశాల్లో గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా ఉదాసీనత పనికిరాదని హరీశ్‌రావు అధికారులకు సూచించారు. సాగునీటి శాఖ యంత్రాంగం, కాంట్రాక్టు సంస్థలు ఒక కుటుంబంగా సమన్వయంతో పనిచేస్తేనే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని చెప్పారు. ఉమ్మడిగానే ప్రజలను, రైతులను ఒప్పించి సజావుగా భూములు సేకరించాలన్నారు. సమస్య జటిలంగా ఉన్న చోట సంబంధిత ఎమ్మెల్యే, మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి.. వారి సహకారంతో పరిష్కరించుకోవాలని ఆదేశించారు. భూసేకరణ పనుల్లో జాప్యానికి సాగునీటి శాఖ యంత్రాంగాన్ని మాత్రమే తప్పుపడతారని.. ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన చారిత్రక బాధ్యత మనపైనే ఉన్నందున బాధ్యతతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
భూసేకరణ పనులు వేగవంతం కావాలన్నారు. భూసేకరణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి, సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని హరీశ్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. కాగా పాలమూరు కోసం మొత్తంగా 26,756 ఎకరాల భూమి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 12,779 ఎకరాలను సేకరించినట్లు ప్రాజెక్టు సీఈ లింగరాజు సమావేశంలో వెల్లడించారు. అందులో 4,229.09 ఎకరాల ప్రభుత్వ భూమి, 8,504.77 ఎకరాల పట్టా భూమి ఉందని చెప్పారు. మిగతా 14,022.77 ఎకరాల సేకరణకు ముమ్మరంగా కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.