యుద్ధం.. తప్పకపోవచ్చు: మోదీ
అవసరమైతే భారతదేశం యుద్ధానికి దిగడం కూడా తథ్యమని ప్రధాని నరేంద్రమోదీ తేల్చేశారు. కొన్ని సందర్భాలలో పరిస్థితుల తీవ్రత దృష్ట్యా యుద్ధం తప్పనిసరి అవుతుందని ఆయన ఉత్తరప్రదేశ్లో దసరా ఉత్సవాలలో పాల్గొన్న సందర్భంగా వెల్లడించారు. ఉగ్రవాదం మానవత్వానికి శత్రువని.. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలను శిక్షించి తీరుతామని మోదీ చెప్పారు. భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మోదీ తొలిసారిగా ఉగ్రవాదంపై బహిరంగంగా స్పందించారు. ''పరిస్థితుల తీవ్రత దృష్ట్యా, కాల బంధనాల దృష్ట్యా అప్పుడప్పుడు యుద్ధం అనివార్యం అవుతుంది'' అని ఆయన అన్నారు.
భారత దేశం ఎప్పుడూ యుద్ధం కంటే శాంతినే కోరుకుందని చెబుతూ.. అందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయడానికి ఆయన రామాయణ మహాభారతాలను ఉదహరించారు. రాముడు, కృష్ణుడు కూడా యుద్ధాలు చేయాల్సి వచ్చిందని అన్నారు. కానీ చాలా కాలంగా మనం యుద్ధాలు మానేసి శాంతియుత జీవనం గడుపుతున్నామని ఆయన తెలిపారు. ముందుగా అక్కడున్నవారందరినీ ఉత్తేజపరిచేందుకు 'జై శ్రీరామ్' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చారిత్రక ఐష్బాగ్ రాంలీలా ఉత్సవాల్లో ఆయన ఈసారి పాల్గొన్నారు. ఉగ్రవాదులను సమూలంగా ఏరిపారేయాలని, వాళ్లకు సాయం చేసేవాళ్లను కూడా వదలకూడదని అన్నారు. చైనాను కూడా పరోక్షంగా మోదీ ప్రస్తావించారు. తమ దేశంలో ఉగ్రవాదం లేదని అనుకునేవాళ్లు పెద్ద తప్పు చేస్తున్నారని.. ఉగ్రవాదాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూసిన కొన్ని దేశాలు ఉన్నాయని కూడా చెప్పారు. భారత దేశం ఉగ్రవాద కార్యకలాపాల గురించి చెబుతున్నా.. 1992-93 వరకు అమెరికా కూడా దాన్ని శాంతిభద్రతల సమస్యగానే భావించేదని, కానీ 26/11 దాడుల తర్వాత అమెరికా సహా చాలా దేశాలు తమ అభిప్రాయాన్ని మార్చుకుని భారత దేశంలో ఉగ్రవాదం ఉన్న విషయాన్ని గుర్తించాయని తెలిపారు. ఈ విజయదశమి చాలా స్పెషల్ అంటూ ముందే ప్రకటించిన మోదీ.. తన మనసులోని ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.
రామాయణంలో జటాయువు మొట్టమొదటి కౌంటర్ టెర్రరిస్ట్ అని ప్రధాని తెలిపారు. మీ ఇళ్లలో ఉన్న సీతలను కాపాడుకోవాలి అంటూ బేటీ బచావో బేటీ పఢావో నినాదాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రజలంతా కూడా ఉగ్రవాదంపై పోరాడాలని, దేశమంతా ఒక్కటిగా నిలిస్తే ఈ ఉగ్రవాదం బాధ మనకు తప్పుతుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికైనా వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు.