పాకిస్థాన్‌తో ఇలా యుద్ధం చేయొచ్చు!
న్యూఢిల్లీ: సరిహద్దుల గుండా టెర్రరిజాన్ని భారత్‌లోకి ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్‌ను పీచమణచడం ఎలా? ప్రత్యక్షంగా సంప్రదాయ యుద్ధానికి దిగాల్సిన అవసరం లేకుండా పాకిస్థాన్ దానంతట అదే స్వయంగా దిగివచ్చేలా చేయడం ఎలా? కశ్మీర్లో లాగా యావత్ పాకిస్థాన్‌లో కల్లోల పరిస్థితులను సృష్టించి ఆ దేశాన్ని కాళ్ల బేరానికి తీసుకరాలేమా? ఈ దిశగా కొంతమంది భారతీయ నిపుణులు యోచిస్తున్నారు.
పాకిస్థాన్ పరిపాలన వ్యవస్థను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పాక్ సైన్యం, రెండు పాక్ ప్రభుత్వం, మూడు పాక్ ప్రజలు. విడివిడిగా ఈ మూడు విభాగాల్లో చిచ్చు పెట్టవచ్చు. పాక్ సైనిక జనరళ్లందరు పార్ట్‌టైమ్ సైనికులు, ఫుల్‌టైమ్ వ్యాపారస్థులు. వారిలో 90 శాతం మందికి సొంతంగా బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు ఉన్నాయి. పైకి రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నడిపినట్లుగా కనిపిస్తుంది కానీ అక్కడి ప్రభుత్వాన్ని నిజంగా నడిపేది ఆర్మీ జనరళ్లే. ఈ విషయం మనకు నవాజ్ షరీష్, అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ ముషార్రఫ్ మధ్య చోటుచేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనం.
ముషారఫ్ గాల్లో ఉండగానే (విమానంలో ప్రయాణిస్తుండగానే) ఆయన్ని పదవి నుంచి నవాజ్ షరీఫ్ తొలగించడం, విమానం దిగిదిగగానే నవాజ్ షరీఫ్‌ను ముషారఫ్ అరెస్ట్ చేయించి తానే దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్న విషయం తెల్సిందే. పాక్‌లో సైనిక జనరళ్లకున్నన్ని వ్యాపారాల్లో సగం కూడా అక్కడి రాజకీయ నాయకులకు లేవంటే ఆశ్చర్యం వేస్తోంది. ఈ రెండు కీలక విభాగాలను భారత్ దెబ్బతీయాలంటే వారి పూర్తి వ్యాపార కార్యకలాపాలను స్తంభింపచేయాలి.
వారి సరకు బయటి ప్రపంచంలో విక్రయించకుండా, బయటి ప్రపంచం సరకు వారి మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలి. ఇది అంత పెద్ద కష్టమేమి కాదు. వారి ఎగుమతి మార్కెట్లతోని భారత్ పోటీ పడాలి. అవసరమైన సబ్సిడీలకు సైతం మన సరకులను చేరవేయాలి. ఈ సబ్సిడీల మొత్తం ఆర్థిక విలువ సంప్రదాయక యుద్ధంలో నాలుగు యుద్ధ విమానాలకు అయ్యే ఖర్చుకాదు. అలాగే మనం పాకిస్థాన్‌తో అన్ని వ్యాపార, రవాణా ఒప్పందాలను రద్దు చేసుకోవాలి.
పాక్‌తో వ్యాపార సంబంధాలు పెట్టుకోకుండా అంతర్జాతీయ సమాజంపై దౌత్యపరంగా ఒత్తిడి తేవాలి. అసరమైన మన పెద్ద మార్కెట్‌ను అడ్డు పెట్టుకోవాలి. పాకిస్థాన్‌తో వ్యాపారం చేస్తారా లేక భారత్‌తో వ్యాపారం చేస్తారా? అన్న విషయాన్ని తేల్చుకోవాల్సిందిగా అన్ని దేశాలపై ఒత్తిడి తీసుకరావాలి. ప్రపంచీకరణ చట్టాలు, ఒప్పందాలు అందుకు అడ్డుపడితే, ప్రభుత్వాలతో కాకుండా కంపెనీలతోనే బేరాలు పెట్టుకోవాలి. మెక్‌డొనాల్డ్, కోక్, పెప్సీ లాంటి కంపెనీలను భారత్ మార్కెట్ కావాలా, పాకిస్థాన్ మార్కెట్ కావాలో తేల్చుకోమని చెప్పి దారికి తెచ్చుకోవచ్చు. పాక్‌తో సంబంధాలను తెగతెంపులు చేసుకోకపోతే చైనా నుంచి ఎలాంటి దిగుమతులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించే ప్రసక్తే లేదని చైనాను బెదిరించాలి.
ఇలా వ్యాపారలావాదేవీలను దెబ్బతీస్తే, పాక్ మిలటరీ, రాజకీయ నాయకుల వెన్నుముకలిరగడంతోపాటు సగం దేశం కుప్పకూలిపోతుంది. అదే సమయంలో పాక్ సైన్యాన్ని మునివేళ్లపై నిలబెట్టేందుకు అటు అఫ్ఘాన్ వైపు నుంచి ఇటు భారత్ వైపు నుంచి పాక్ సరిహద్దుల్లో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించాలి. ఇటీవల కాలంలో ప్రపంచంలోకెల్లా ఎక్కువ ఆయుధాలను కొనుగోలు చేస్తున్న భారత్ మరిన్ని ఆయుధాలను కొనాలి. ప్రధానంగా భారత్ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ఆయుధాలను కొనుగోలు చేయడం లేదు. కాలంతీరిపోయిన ఆయుధాల స్థానంలో భర్తీ చేసుకుంటున్నాం. అదే సమయంలో పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, ఇతర ఆయుధాలు విక్రయించకుండా రఫెల్, బోఫోర్స్ లాంటి కంపెనీలపై కూడా భారత్ ఒత్తిడి తీసుకరావాలి.
అదే సమయంలో విద్యా, ఉపాధి అవకాశాల పేరిట పాకిస్థాన్ యువతను భారత్ ఆకర్షించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి ఎలా ఉంటుందో వారికి అనుభవపూర్వకంగా చూపించాలి. టెర్రరిజమ్వైపు యువతను రెచ్చగొడుతున్న పాక్‌లాంటి వ్యవస్థపై తిరుగుబాటు చేసేలా వారిని ప్రోత్సహించాలి. వీటన్నింటికీ పక్కా వ్యూహంతో ముందుకు కదలాలి. (‘పాకిస్థాన్‌పై భారత్ ఎలా యుద్ధం చేయాలి’ అనే అంశంపై టీవీ యాంకర్లు, రాజకీయ నాయకులు ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్లిస్తున్న నేపథ్యంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సీఈవో, 11 ఏళ్ల పాటు భారత సైన్యంలో పనిచేసిన రామన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి).