పాక్ యుద్ధంతో ఎన్నికల్లో లాభం పొందే వ్యూహం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఏకంగా ముఖ్యమంత్రే ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి దుర్దినమన్నారు. చార్మినార్ వద్ద బుధవారం జరిగిన రాజీవ్ సద్భావన యాత్ర స్మారక సభలో ఆయన పాల్గొన్నారు. బహిరంగంగా ఫిరాయింపులు జరుగుతున్నా న్యాయవ్యవస్థ నిర్ణయం తీసుకోవడం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని, ఆర్ఎస్ఎస్ శిక్షణ వల్లే సర్జికల్ స్ట్రైక్స్ అంటూ సైన్యం దాడులను రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలోనూ సర్జికల్ స్ట్రైకస్స్ జరిగాయని గుర్తుచేశారు. కానీ ఇప్పుడే జరిగినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటోందని అన్నారు.
ఎన్నికల హామీల అమలులో బీజేపీ విఫలమైందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అందుకే పాకిస్థాన్‌తో యుద్ధం వస్తే ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తోందన్నారు. గతంలో ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ధైర్యంగా పాక్‌తో యుద్ధం చేశారని తెలిపారు. మత నియమాలను కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని, కామన్ సివిల్ కోడ్‌పై అన్ని పార్టీలతో చర్చించాలని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం కుదిరితేనే తేవాలి తప్ప.. ఒక మతంపై కామన్ సివిల్ కోడ్ రుద్దితే కాంగ్రెస్ పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు.
నల్లధనం పేరుతో చిన్న వ్యాపారులకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడి జరిగితే తల దించుకుంటానన్న ప్రధాని నరేంద్రమోదీ, గుజరాత్‌లో దళితులపై ఊచకోత జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బ్రిక్స్ డిక్లరేషన్‌లో సిరియా ప్రస్తావన ఉందే తప్ప పాకిస్థాన్ ప్రస్తావన లేదని, ఇది మోదీ దౌత్య వైఫల్యం కాదా అని దిగ్విజయ్ అన్నారు.