డిగ్గీ రాజాపై భగ్గుమంటున్న కాంగ్రెస్ నేతలు!
పణజి: గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ మృదులా సిన్హా ఆహ్వానించడంతో బిత్తరపోయిన కాంగ్రెస్ నేతలు.. పార్టీ హైకమాండ్ నేతల తీరుపై భగ్గుమంటున్నారు. పార్టీకి బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ, చిన్న పార్టీలతో సత్వరమే సంప్రదింపులు జరపడంలో విఫలమవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోతున్నామని గోవా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21కు కేవలం నాలుగు సీట్ల దూరంలో ఉండటంతో ఎలాగైనా తామే సర్కారును ఏర్పాటుచేస్తామని గోవా కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. కానీ, కేవలం 13 స్థానాలే గెలుపొందిన బీజేపీ రాత్రికే రాత్రే చక్రం తిప్పి.. చిన్న పార్టీల మద్దతుతో మెజారిటీ ఫిగర్‌ను సాధించింది. ఈ పరిణామంతో కంగుతిన్న కాంగ్రెస్ నేతలు గోవా సీఎంగా మనోహర్ పారికర్ ప్రమాణాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు గుమ్మం తొక్కారు. అయినా, సుప్రీంకోర్టు పారికర్ ప్రమాణాన్ని నిలిపివేస్తుందా? అన్నది కాంగ్రెస్ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా హైకమాండ్ దూత, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యూహాత్మక లోపాల వల్లే గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోయిందని రాష్ట్ర నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా గోవా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న విశ్వజిత్ పీ రాణే పార్టీ నాయకత్వంపై, దిగ్విజయ్ పై బాహాటంగానే విమర్శల వర్షం కురిస్తున్నారు. అధినాయకత్వం మిస్ మేనేజ్‌మెంట్ వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. తాజా పరిణామాలపై ఆగ్రహంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చిన ఆయన తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌ను వీడాలనుకుంటున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. తనపై ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ,. తమ నాయకురాలు సోనియాగాంధీపై ఉన్న విశ్వాసంతో పార్టీలో కొనసాగుతున్నానని ఆయన పేర్కొన్నారు.