యూపీ, పంజాబ్‌లో హంగ్!
గోవాలోనూ అంతే...
► ఉత్తరాఖండ్ బీజేపీదే
► ఒపీనియన్ పోల్స్ వెల్లడి
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. దేశంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌తోపాటుగా పంజాబ్, గోవాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని, ఉత్తరాఖండ్‌లో మాత్రం కమలదళానిదే అధికారమని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ద వీక్–హంస రీసెర్చ్ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ‘మొత్తం 403 స్థానాల్లో బీజేపీకి 192–196 సీట్లు రావొచ్చు. సమాజ్‌వాదీ– కాంగ్రెస్ కూటమికి 178–182 సీట్లు, బీఎస్పీ అతి దారుణంగా 20–24 స్థానాలకు పరిమితం అవుతుందని తేలింది. ఇతరులు 5–9 సీట్లు గెలుచుకుంటారు’ అని సర్వే అంచనా వేసింది. అటు పంజాబ్‌లోనూ హంగ్ తప్పేట్లు కనిపించటం లేదంది.
‘పంజాబ్‌లోని 117 సీట్లలో కాంగ్రెస్ 49–51 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 33–35 స్థానాలతో రెండో స్థానంలో, అకాలీదళ్–బీజేపీ కూటమి 28–30 సీట్లతో మూడో స్థానంలో నిలవనుంది. ఇతరులకు 3–5 సీట్లు వస్తాయి’ అని సర్వే పేర్కొంది. 70సీట్లున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 37–39 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుం టుందని.. కాంగ్రెస్ 27–29 స్థానాల్లో, బీఎస్పీ 1–3 స్థానాల్లో గెలవొచ్చని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. గోవాలో 40 సీట్లకు గానూ అధికార బీజేపీ 17–19, కాంగ్రెస్ 11–13 స్థానా ల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఆప్ 2–4 సీట్ల కు, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి 3–5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. యూపీలో కాంగ్రెస్– ఎస్పీ జట్టుకట్టాక (వారం క్రితం) ఈ పోల్ నిర్వహించారు.
యూపీలో అంచనా ఇలా..
బీజేపీ కూటమి 192–196
ఎస్పీ–కాంగ్రెస్ 178–182
బీఎస్పీ 20–24
ఇతరులు 5–9
మొత్తం స్థానాలు 403