మంత్రి పదవులు మిఠాయిల్లా పంపకం!
- బీజేపీకి ఏమైనా నైతిక విలువలు ఉన్నాయా?
- ప్రజాతీర్పునకు వెన్నుపోటు పొడుస్తోంది..
న్యూఢిల్లీ: గోవాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపేతర ఎమ్మెల్యేలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్‌ను తాము సాధిస్తామని తెలిపారు. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు గెలుపొందగా, బీజేపీ 13 సీట్లను సొంతం చేసుకుంది. దీంతో ఇక్కడ 10 స్థానాల్లో గెలుపొందిన స్వతంత్రులు కీలకంగా మారారు.
అయితే, కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లను గెలుపొందినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ తీరుపై దిగ్విజయ్ మండిపడ్డారు. 'ఆ పార్టీకి ఏమైనా నైతిక విలువలు ఉన్నాయా? వారిని ప్రజలు ఓడించారు. అయినా, ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపి, మంత్రి పదవులను మిఠాయిల్లా పంచిపెట్టి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తోంది' అని విమర్శించారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 21 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగడితే తాము ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధమన్నారు. కానీ, ఇలా చేయడం ప్రజాతీర్పునకు వెన్నుపోటు పొడవడమేనని ఆయన దుయ్యబట్టారు.