నెలకు 5 లీటర్ల పెట్రోల్ ఉచితం
పనాజి: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటీలుపడి వరాలు కురిపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఫ్రీ మంత్రం జపిస్తున్నాయి. గోవాలో అధికారంలోకి వస్తే విద్యార్థులకు నెలకు 5 లీటర్ల చొప్పున పెట్రోల్ను ఉచితంగా సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సోమవారం గోవా కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజలకు ఉచితంగా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. గోవాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.
త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్వాదీ పార్టీ జనాకర్షక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. యూపీలో మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు ల్యాప్టాప్లు, పేద మహిళలకు ప్రెషర్ కుకర్లను ఇస్తామని చెప్పారు.