ప్రయాణికుడి డబ్బులు లాక్కున్న హిజ్రాల అరెస్ట్
* రూ.7,500 రికవరీ
* జీఆర్పీ సీఐ రవికుమార్
మట్టెవాడ : ప్రయాణికుడిని బెదిరించి డబ్బులు లాక్కున్న హిజ్రాలను వరంగల్ జీఆర్పీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జీఆర్పీ సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. కేరళ నుంచి బిలాస్పూర్ వెళ్లే ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులోని జనరల్ బోగీలో చత్తీస్‌గఢ్‌కు చెందిన శివచరణ్‌కుమార్ ప్రయాణిస్తున్నాడు. వరంగల్ ప్రాంతానికి చెందిన హిజ్రాలు స్టెల్లా, లావణ్య, రజిత, శ్రీజ, హాసిని వరంగల్ స్టేషన్లో ఈ రెలైక్కారు. వారు శివచరణ్‌ను డబ్బులు అడగగా కొన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కానీ హిజ్రాలు అవి చాలవని, అతడి వద్ద ఉన్న బ్యాగు లాక్కుని అందులోని రూ.7500 తీసుకున్నారు. అనంతరం రైలు వడ్డేపల్లి చెవువు సమీపంలో ఆగిన పుడు దూకి పారిపోయారు. ఈ సంఘటనను రైల్వే అధికారుల దృష్టికి ఫోన్ ద్వారా ప్రయాణికులు తీసుకెళ్లగా జీఆర్పీ పోలీసులు వారిని నాగేంద్రనగర్‌కు చెందిన హిజ్రాలుగా గుర్తించారు.
ఈ క్రమంలోనే శివనగర్ వైపు ఉన్న రోడ్డుపై నిందితులైన హిజ్రాలను పట్టుకున్నారు. వారి నుంచి రూ.7500 రికవరీ చేయడంతోపాటు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 384 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీఐ హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.