ఏప్రిల్ 27న ప్లీనరీ.. ఇవే కేబినెట్ కీలక నిర్ణయాలు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం స్థానంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధి యాక్ట్‌ను తేవాలని కేబినెట్ నిర్ణయించింది.
భూదాన్ బోర్డు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సవరణల మేరకు భూదాన్ బోర్డు నిర్మాణంలో ప్రభుత్వం కీలక సవరణలు తేనుంది. భూదాన ఉద్యమ రూపశిల్పి వినోభా బావే నామినీలు భూదాన్ బోర్డులో ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం తొలగించనుంది. ప్రభుత్వమే ఎంతమందితోనైనా కొత్త బోర్డు ఏర్పాటుచేసేలా చట్ట సవరణలు తీసుకురానుంది. ఆక్రమణకు గురైన భూదాన భూములను రక్షించేందుకు తహశీల్దార్‌కు అధికారాలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇక వచ్చేనెల 27న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని ఘనంగా జరుపాలని కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదేరోజు భారీ ర్యాలీకి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వరంగల్ ప్లీనరీ వేదికగా తెలంగాణ ప్రభుత్వ విజయాలపై ప్రజలకు సంపూర్ణ సందేశాన్ని ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు.