Ward Boys
-
వార్డు బాయ్స్ లేక..
కర్నూలు: రాయలసీమకే తలమానికమైన కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వార్డు బాయ్‌ల కొరత వేధిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని వారు, వివిధ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చిన వారిని బంధువులే స్ట్రెచర్లపై పరీక్షలకు తీసుకువెళ్తున్నారు. -
ఎన్నాళ్లీ యాతన..!
విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రికి వచ్చే రోగులకు సేవలు అందని ద్రాక్షగా మారాయి. సకాలంలో స్పందించేవారు లేకపోవడంతో ఆపదలో ఉన్న రోగులు, వారి బంధువులు ఆవేదన చెందుతున్నారు. కొన్నిసార్లు వార్డుబాయ్‌లుగా మారి రోగులను వార్డులు, ఎక్స్‌రే, స్కానింగ్ విభాగాలకు తీసుకెళ్తున్నారు. కళ్లముందే సేవలు అందకపోయినా పట్టించుకునే అధికారులే కరువయ్యారంటూ గగ్గోలు పెడుతున్నారు. అధికారులు రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడం తప్ప చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని వాపోతున్నారు. జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో రోగులు అధిక సంఖ్యలో వస్తారు. ఆస్పత్రికి అవుట్ పేషేంట్లు 800 నుంచి 1000 మంది వరకు వస్తారు. ఇన్‌పేషెంట్లు 150 నుంచి 160 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో కంటి, ఎముకల, పిల్లల, ఈఎన్టీ, దంత, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, చర్మ, గైనిక్, మానసిక సంబంధిత వ్యాధులకు వైద్య సేవలు అందిస్తారు. అయితే, సేవల్లో అసౌకర్యాలు ఉండడం రోగులకు ఆవేదన మిగుల్చుతోంది. నడవలేకపోతే నరకమే.... ఆస్పత్రికి వచ్చే రోగులు నడవగలిగితే ఫర్వాలేదు. లేదంటే నరకం చూడాల్సిన పరిస్థితి. నడవలేని స్థితిలో ఉన్నాం తీసుకుని వెళ్లండని వైద్య సిబ్బందిని అడిగినా పట్టించుకునే వారే కరువయ్యారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నిత్యం జరుగుతున్న తంతే ఆరోపణలకు ఊతమిస్తుంది. పునరావతం కాకుండా చూస్తాం నడవలేని స్థితిలో ఉన్న రోగులను వీల్‌చైర్, లేదంటే స్ట్రెచ్చర్‌పై తరలించేలా చర్యలు తీసుకుంటాం. రోగి బంధువులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. – కె.సీతారామరాజు,సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
వార్డుబాయ్ పోస్టుకు రూ.2 లక్షలు
నిరుద్యోగుల ఆశను ఆసరాగా చేసుకున్న ఓ ప్రజాప్రతినిధి చివరకు ఆసుపత్రిలో వార్డు బాయ్ పోస్టులను సైతం అమ్మకానికి పెట్టేశాడు. తనకు నమ్మకస్తులైన అనుచరుల ద్వారా వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఒప్పందం చేసుకున్న ఓ సంస్థ భర్తీ చేసే ఈ పోస్టులకు ఏకంగా రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): అన్ని బోధనాసుపత్రుల్లో ఫ్రంట్ డెస్క్ మేనేజర్లు, వార్డు బాయ్‌లు, ఎలక్ట్రియన్లు, లిఫ్ట్ ఆపరేటర్లను నియమించుకుని మూడేళ్ల పాటు సేవలందించాలని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం ఓ ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఏ పోస్టులు భర్తీ చేయాలన్నా ముందుగా పత్రికా ప్రకటన ఇచ్చి, ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి భర్తీ చేసేవారు. గతంలోనూ ఆసుపత్రుల్లో ఇదే విధంగా నియామకాలు జరిగాయి. ఇందుకు విరుద్ధంగా జరిగిన నియామకాలను అప్పటి జిల్లా ఉన్నతాధికారులు రద్దు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని బోధనాసుపత్రుల్లో సిబ్బందిని నియమించుకునే బాధ్యత ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆరుగురు ఫ్రంట్ డెస్క్ మేనేజర్లు, 42 మంది వార్డు బాయ్‌లు, 10 మంది ఎలక్ట్రీయన్లు, నలుగురు లిఫ్ట్ ఆపరేటర్లు కలిపి మొత్తం 62 పోస్టులున్నాయి. సబ్ లీజ్ పేరుతో మాయ.. ప్రభుత్వ ఆసుపత్రిలో నియమించుకునే పోస్టులను సదరు ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు తమకు సబ్‌లీజ్‌కు ఇచ్చారని, తామే పోస్టులను భర్తీ చేస్తామని ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు నగరంలో హల్చల్ చేస్తున్నాడు. సదరు ప్రజాప్రతినిధి ఎవరికి చెబితే వారినే పోస్టుల్లో నియమిస్తారని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా వార్డుబాయ్ పోస్టుకు రూ.2లక్షలు, ఫ్రంట్ డెస్క్ మేనేజర్, ఎలక్ట్రిషియన్ పోస్టులకు రూ.3లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ పోస్టులకు ఇంత మొత్తమా అంటూ పలువురు అభ్యర్థులు బహిరంగంగానే తిట్టిపోస్తున్నారు. నిరుద్యోగ సమస్య కారణంగా పలువురు అభ్యర్థులు అడిగిన మొత్తాన్ని కూడా ఇచ్చేందుకు ముందుకు వస్తుండటంతో ప్రజాప్రతినిధి అనుచరులకు అడ్డులేకుండా పోతోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కొంత మొత్తాన్ని వారికి ముట్టచెప్పారని, మిగిలిన మొత్తాన్ని నియామకాలు జరిగాక ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. సదరు ప్రజాప్రతినిధికి తెలిసే పోస్టుల అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా ఈ పోస్టుల నియామకాలకు సంబంధించి నిబంధనలు తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆసుపత్రి అధికారులు చెబుతున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీతో ఎంత మేరకు ఒప్పందం చేసుకున్నారు, ఉద్యోగుల జీతం ఎంత? అనే విషయాలు కూడా తమకు తెలియవని వారు పేర్కొంటున్నారు. ఆసుపత్రి నుంచి వెళ్లే ఎన్టీఆర్ వైద్యసేవ రివాల్వింగ్ ఫండ్ నుంచి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. -
పాపం పండింది..!
విజయనగరం ఫోర్ట్: ఏళ్ల తరబడి సాగుతున్న దందా ఎట్టకేలకు తెరపడింది. గుట్టుగా సాగుతున్న దందా ను ఓ వ్యక్తి వీడియో తీసి అధికారుల చేతిలో పెట్టడంతో ఓ భాగోతం వెలుగులోకి వచ్చింది. కేంద్రాస్పత్రిలో వార్డు బాయ్‌లు కొంత కాలంగా కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది బాయ్‌లు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ఆరోపణలు, విమర్శలు ఎక్కువయ్యాయి. దీని నివారణ కోసం అధికారులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. దందా సాగుతుంది ఇలా.. కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసర పరిస్థితుల్లో కేజీహెచ్‌కు రిఫర్ చేస్తారు. విషయం తెలిసిన వెంటనే బాయ్‌లు బాధితుల దగ్గరకు వెళ్లి మాకు తెలిసిన వాహనం ఉంది. తక్కువ డబ్బులకే కేజీహెచ్‌కు తీసుకు వెళతారని చెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేస్తే సదరు వాహన యజమాని బాయ్‌కు కమీషన్ ఇస్తారు. అలాగే ఇక్కడ మృతదేహాలను కూడా వారికి నచ్చిన వాహనాల్లోనే ఎక్కిస్తారు. అప్పుడూ కమీషన్ వస్తుంది. ఈ ప్రక్రియ కొంత కాలంగా జరుగుతుంది. తాజాగా వెలుగులోకి.. కొద్ది రోజుల క్రితం ఓ బాయ్ తనకు తెలిసిన ప్రయివేటు వాహనంలో ఒక మృత దేహాన్ని ఎక్కించారు. అలా చేసినందుకు గానూ సదరు యజమానికి బాయ్‌కు కమీషన్ ఇవ్వలేదు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి అధికారులకు పంపించాడు. దీంతో ఆ వార్డు బాయ్‌పై చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అలాగే మరో బాయ్ విధి నిర్వహణలో అలసత్వం చూపుతున్నాడన్న కారణంగా ఆయనపై చర్యలకు కూడా అధికారులు సిద్ధం అవుతున్నారు. 30 శాతం కమీషన్.. ప్రయివేటు వాహనంలో రోగిని, మృతదేహాన్ని తరలించినందుకు వార్డుబాయ్‌లు సుమారు నూటికి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం... శ్రీను అనే వార్డు బాయ్ రోగులతో సరిగ్గా మెలగడం లేదని, వైద్యులకు సహకరించడం లేదని, విధుల పట్ల అలసత్వం చూపుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. చర్యలు తీసుకుంటాం. – కె. సీతారామరాజు, సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
ఆ‘పరేషాన్!’
ఉస్మానియా ఆపరేషన్ గదులకు తాళం చికిత్సలకు అంతరాయం ఆందోళనలో రోగులు... పట్టించుకోని అధికారులు సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్ లేకపోవడంతో ఓపీ గదులే కాదు... ఆపరేషన్ థియేటర్లు సైతం మూతపడుతున్నాయి. వైద్యులు లేకపోవడంతో న్యూరోఫిజీషియన్ ఓపీ గదికి ఇప్పటికే తాళాలు పడ్డాయి. నర్సులు, వార్డు బాయ్స్ లేమితో తాజాగా జనరల్ సర్జరీ విభాగంలోని ఆపరేషన్ థియేటర్-3 గదికి తాళాలు పడ్డాయి. దీంతో ఆ విభాగంలో శస్త్రచికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడి రోగుల అవసరాలు పూర్తిగా తీర్చాలంటే కనీసం 835 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. ప్రస్తుతం 309 మంది మాత్రమే ఉన్నారు. వైద్యులు లేక కొన్ని విభాగాలు... వైద్య పరికరాలు, స్టాఫ్ నర్సులు లేక మరికొన్ని విభాగాలు మూత పడుతున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేరుకే బయోమెట్రిక్ హాజరు సుమారు 1100 పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి నిత్యం 1400 నుంచి 1600 మంది రోగులు వస్తుంటారు. ఇక్క డ నిత్యం 1200 మంది చికిత్స పొందుతుంటారు. 12 ఆపరేషన్ థియేటర్లు ఉండగా... వీటిలో ఇప్పటికే రెండు మూతపడ్డాయి. ఆరు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో చిన్నాపెద్ద కలిపి నిత్యం సుమారు 150 సర్జరీలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 22 విభాగాలుంటే, 200పైగా వైద్యులు పని చేస్తున్నారు. వీరిలో సగం మంది అసలు ఆస్పత్రికే రావడం లేదు. ఒక వేళ వచ్చినా...ఓపీకి వెళ్లకుండా గదులకే పరిమితమవుతున్నారు. కొంతమంది దంపతులూ ఇక్కడ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఆస్పత్రికి వచ్చి ఇద్దరి సంతకాలు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను అమలు చేశారు. దీన్ని ఉపయోగించేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. స్టాఫ్‌నర్సుల కొరత వల్ల రోగి బంధువులే సంరక్షకులుగా మారుతున్నారు. వార్డులకు తరలించడం మొదలు సెలైన్లు ఎక్కించడం, ఇంజక్షన్లు ఇవ్వడం వంటి కీలక పనులన్నీ వారే చేయాల్సి వస్తోంది. ఎంఆర్డీ సెక్షన్లో సిబ్బంది కొరత వల్ల మెడికో లీగల్ కేసుల రికార్డులను పోలీసులే వెతుక్కోవాల్సి వస్తోంది. మరోవైపు కీలకమైన రికార్డులు మాయమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మొరాయిస్తున్న యంత్రాలు రేడియాలజీ విభాగంలో పది ఎక్సరే యంత్రాలు ఉండగా.. వీటిలో ఇప్పటికే సగం మూలకు చేరాయి. సిటీస్కాన్ గడువు ముగియడంతో మిషన్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. సాధారణ రోగులు ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవాలంటే కనీసం నెల రోజుల ముందు పేరు నమోదు చేసుకోవాల్సి వస్తోంది. రోగుల కోసం కేటాయించిన పేయింగ్ రూమ్‌ల్లో పరిపాలనాపరమైన పనులు నిర్వహిస్తున్నారు. రోగులను ఆఫరేషన్ థియేటర్లకు తరలించే లిఫ్ట్‌లు పని చేయకపోవ డంతో ఇటీవల ఏకంగా సర్జరీలనే వాయిదా వేయాల్సి వచ్చింది.