విజయనగరం ఫోర్ట్: ఏళ్ల తరబడి సాగుతున్న దందా ఎట్టకేలకు తెరపడింది. గుట్టుగా సాగుతున్న దందా ను ఓ వ్యక్తి వీడియో తీసి అధికారుల చేతిలో పెట్టడంతో ఓ భాగోతం వెలుగులోకి వచ్చింది. కేంద్రాస్పత్రిలో వార్డు బాయ్‌లు కొంత కాలంగా కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది బాయ్‌లు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ఆరోపణలు, విమర్శలు ఎక్కువయ్యాయి. దీని నివారణ కోసం అధికారులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు.
దందా సాగుతుంది ఇలా..
కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసర పరిస్థితుల్లో కేజీహెచ్‌కు రిఫర్ చేస్తారు. విషయం తెలిసిన వెంటనే బాయ్‌లు బాధితుల దగ్గరకు వెళ్లి మాకు తెలిసిన వాహనం ఉంది. తక్కువ డబ్బులకే కేజీహెచ్‌కు తీసుకు వెళతారని చెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేస్తే సదరు వాహన యజమాని బాయ్‌కు కమీషన్ ఇస్తారు. అలాగే ఇక్కడ మృతదేహాలను కూడా వారికి నచ్చిన వాహనాల్లోనే ఎక్కిస్తారు. అప్పుడూ కమీషన్ వస్తుంది. ఈ ప్రక్రియ కొంత కాలంగా జరుగుతుంది.
తాజాగా వెలుగులోకి..
కొద్ది రోజుల క్రితం ఓ బాయ్ తనకు తెలిసిన ప్రయివేటు వాహనంలో ఒక మృత దేహాన్ని ఎక్కించారు. అలా చేసినందుకు గానూ సదరు యజమానికి బాయ్‌కు కమీషన్ ఇవ్వలేదు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి అధికారులకు పంపించాడు. దీంతో ఆ వార్డు బాయ్‌పై చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అలాగే మరో బాయ్ విధి నిర్వహణలో అలసత్వం చూపుతున్నాడన్న కారణంగా ఆయనపై చర్యలకు కూడా అధికారులు సిద్ధం అవుతున్నారు.
30 శాతం కమీషన్..
ప్రయివేటు వాహనంలో రోగిని, మృతదేహాన్ని తరలించినందుకు వార్డుబాయ్‌లు సుమారు నూటికి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం...
శ్రీను అనే వార్డు బాయ్ రోగులతో సరిగ్గా మెలగడం లేదని, వైద్యులకు సహకరించడం లేదని, విధుల పట్ల అలసత్వం చూపుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. చర్యలు తీసుకుంటాం.
– కె. సీతారామరాజు,
సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment