చోడిపల్లి ముత్తాయమ్మను డోలీలో తీసుకువస్తున్న దృశ్యం (ఫైల్)
విజయనగరం, సాలూరు రూరల్: సరైన వైద్యం అందించకపోతే వైద్యుడిది తప్పుడు. మరి గ్రామాలకు సరైన రహదారి, వైద్య సదుపాయలు కల్పించకపోతే ఎవరిది బాధ్యత. ఏజెన్సీ పరిధిలో మాతా,శిశు మరణాలు ఎక్కువగా సంభవించడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికా రులు తప్పు చేసినా, విధుల్లో అలసత్వం వహిం చినా వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టి మరీ వారిపై విరుచుకుపడే ప్రభుత్వ పెద్దలు అసలు గిరిజనులకు తాము రహదారి, వైద్య సౌకర్యం ఎంతవరకు కల్పించామో ఆలోచించుకోకపోవడం దారుణం. గిరిశిఖర గ్రామాలకు రహదారులు లేకపోవడం.. అంబులెన్స్‌ల్లో సౌకర్యాలు లేకపోవ డం... ఆస్పత్రుల్లో సదుపాయాలు లేకపోవడం.. తదితర కారణాల వల్ల ఏజెన్సీ పరిధిలో మాతా,శిశుమరణాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రభుత్వానికి నోటీసులు..
సాలూరు మండలం కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందె అనే బాలింతకు పుట్టిన బిడ్డ మరణించడం.. బాలింతను డోలీలో గ్రామస్తులు తీసుకురావడంపై జూలై 31న సాక్షి ప్రధాన సంచికలో 3వ పేజీలో ‘జోరువానలో 12 కిలోమీటర్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని జాతీయ మీడియా ద్వారా తెలుసుకున్న జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటాగా కేసు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఐటీడీఏ పీఓ డా.లక్ష్మీశా ఆ గ్రామానికి కాలి నడకన వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
వైటీసీలో వసతిగృహం ఏర్పాటు..
ఇటీవల ఐటీడీఏ పీఓ డాక్టర్ లక్ష్మీశా గిరిశిఖర గ్రామాల్లో పర్యటించి ప్రసవ సమయానికి చేరువైన గర్భిణినులను సాలూరు వైటీసీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతిగృహానికి తరలించాలని సూచించారు. దీంతో వసతిగృహానికి చేరుకున్న గర్భిణులను సంరక్షించి సమయానికి ఆస్పత్రులకు తీసుకెళ్తుండడంతో సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ కొంతవరకు సత్ఫలితాలు ఇస్తోంది. గర్భిణులను తరలించడంతో గిరిజనులు మరింత చైతన్యవంతమైతే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
ఇటీవల చోటుచేసుకున్న విషాదకర సంఘటనలు
♦ సెప్టెంబర్ 17న మిర్తిగుడ్డివలస గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మువ్వల శారద (20)కు సమయానికి వైద్యం అందకపోవడంతో మృతి చెందింది.
♦ సాలూరు మండలం కొదమ పంచాయతీ మాసిక చింతలవలస గ్రామానికి చెందిన గర్భిణి చోడిపల్లి ముత్తాయమ్మకు సెప్టెంబర్ మూడో తేదీ సాయంత్రం పురిటినొప్పులు వచ్చాయి. మరుచటి రోజు ఆమెను ఆస్పత్రికి తరలించాలనుకున్నారు. అయితే గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో భర్త చోడిపల్లి బీసు, తదితరులు డోలీలో ముత్తాయమ్మను అటవీమార్గం గుండా కాలినడకన తీసుకువస్తుండగా మార్గమధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలింత డోలీలో కూర్చోలేకపోవడంతో గ్రామస్తులు తల్లీబిడ్డలను గ్రామానికి తీసుకెళ్లిపోయారు.
♦ సాలూరు మండలంలోని గిరిశిఖర కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందెకు జూలై 29న పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే నెలలు నిండకుం డానే ప్రసవం జరగగా మగబిడ్డ పుట్టినా వెంటనే మృతి చెందాడు. ఈ క్రమంలో గిందెకు తీవ్ర రక్తస్రావమైంది. గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో భర్త డుంబ్రీ, స్థానికులు డోలీ కట్టి అందులో గిందెను ఉంచి సుమారు 12 కిలోమీటర్లకు పైగా కొండ మార్గంలో రాళ్లు, ముళ్ల పొదలు దాటుకుంటూ దుగ్గేరు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఐటీడీఏ పీఓ లక్ష్మీశాకు సమాచారం అందడంతో మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.
♦ జాతీయ రహదారి ఎన్.హెచ్.26 నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాచి పెంట మండలంలోని ఆజూరు పంచాయతీ చాకిరేవువలస గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ బడ్నాన పార్వతి (24) జనవరి 28వ తేదీ రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చ తనువు చాలించింది. తల్లి మరణించిన కొద్ది సేపటికే బిడ్డ కూడా మృతి చెందాడు.
♦ సాలూరు మండలం బాగువలస గ్రామానికి చెందిన చిన్నమ్మలు 2017 జూలై 24న సాలూరు సీహెచ్‌సీలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తీవ్ర రక్తస్రావం కావడం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బాలింతను విజయనగరం ఘోషా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ క్రమంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ అంబులెన్స్‌లో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో చిన్నమ్మలు మార్గమధ్యలో కన్ను మూసింది.
♦ కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక అనసూయ సకాలంలో వైద్యం అందక 2017 జూలై 24న ఓ బిడ్డకు జన్మనిచ్చి మత్యు ఒడిలోకి జారుకుంది.
♦ సాలూరు మండలంలోని జిల్లేడువలస పంచాయతీ నారింజపాడు గ్రామానికి చెందిన పాలిక రమణమ్మకు 2017 జూన్ 19న పురిటినొప్పులు వచ్చాయి. గ్రామస్తులు డోలీ ద్వారా మైదాన ప్రాంతానికి తీసుకువచ్చి ఓ ప్రైవేట్ వాహనంలో సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినా బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం తరలించారు. అక్కడ బిడ్డ మృతి చెందడంతో ఆ తల్లికి గర్భశోకం మిగిలింది.
♦ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న మాతాశిశు మరణాలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. లేనిపక్షంలో ఎంతోమంది బాలింతలు, గర్భిణులు, పసికందుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment