పచ్చ చొక్కాలకు పనుల పందేరం!
⇒నామినేషన్‌పై మున్సిపాలిటీల్లో రూ. 5 లక్షల లోపు పనులు
⇒కార్పొరేటర్, కౌన్సిలర్, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో కమిటీలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో అధికార పార్టీ కార్యకర్తలకు పనులు అప్పగించి నిధులు పందేరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు పురపాలక శాఖ పరిధిలో లక్ష రూపాయలు దాటిన పనులకు టెండర్లు పిలిచి కేటాయించారు. తాజాగా నిబంధనలు మార్చి రూ.5 లక్షల వరకు నామినేషన్ ప్రాతిపదికన కట్టబెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు పురపాలకశాఖ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్ జీవో జారీ చేశారు. కొద్ది రోజుల క్రితమే పంచాయతీరాజ్ విభాగంలో పనులను నామినేషన్ కిందకు తెచ్చారు. ఇప్పుడు మున్సిపాలిటీల వంతు వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని ప్రాంతంతో పాటు వివిధ మేజర్ మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల పనులు జోరుగా జరగనున్నాయి. హడ్కో నుంచి నిధులు అందనున్న నేపథ్యంలో నామినేషన్ పనులకు రూ.5 లక్షల వరకూ పెంచేలా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు.
వార్డ్ లెవల్ కమిటీలు, స్థానిక కార్పొరేటర్ లేదా వార్డ్‌మెంబర్, కౌన్సిలర్లకే బాధ్యతలు అప్పగించటంతో నామినేషన్ పనులు పూర్తిగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరగనున్నాయి. మున్సిపాలిటీల్లో ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో రూ.5 లక్షల లోపు పనుల కేటాయింపుపై ప్రభుత్వం బుధవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు..
⇒ గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లు, స్వయం సహాయక బృందాలు, వార్డ్లెవల్ కమిటీలకు కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పనులు అప్పగించనున్నారు.
⇒ సంబంధిత స్థానిక సంస్థ పనులపై తీర్మానం చేస్తుంది.
⇒ పనుల కేటాయింపును వార్డ్ స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి వార్డ్ సభ్యుడు లేదా కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్‌గా ఉంటారు. ఎస్‌హెచ్‌జీ లీడర్లు, బిల్ కలెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు.
⇒ వార్డు స్థాయి కమిటీ లేదా కాలనీ సంక్షేమ సంఘానికి చెందిన వారిలో నైపుణ్యం ఉన్న వారిని నియమిస్తారు. ఎస్హెచ్జీకి చెందిన ఒక మహిళ సభ్యురాలిగా ఉంటుంది. పైన పేర్కొన్న కమిటీ సభ్యులు కూడా ఉంటారు.
⇒ వార్డు స్థాయి కమిటీ లేదా కాలనీ సంక్షేమ సంఘం సకాలంలో కమిటీలను నియమించటంలో విఫలమైతే మున్సిపాలిటీ కమిషనరే కమిటీని నిర్ణయించి పనులను కేటాయిస్తారు.
⇒ పనులు జరిగే చోట స్థానికులనే కూలీలుగా నియమించుకోవాలి.
⇒ పని ప్రారంభానికి ముందు ఒకసారి, పనులు జరిగే సమయంలో ఒకసారి, పనుల పూర్తయ్యాక మరోసారి మూడు దఫాలుగా సమావేశాలు నిర్వహించి వివరాలతో రికార్డు నిర్వహించాలి.
⇒ నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు పనులకు సంబంధించిన ఫొటోలు పరిశీలించి సంబంధిత శాఖ ఇంజనీర్లు తగిన చర్యలు తీసుకోవాలి.