‘ఇంటింటా’నిలదీత
ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి కాలవకు చుక్కెదురు
రాయదుర్గం :
రాయదుర్గంలో సోమవారం చేపట్టిన ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమంలో మంత్రి కాలవ శ్రీనివాసులుకు చుక్కెదురైంది. ఏ ఇంటికెళ్లినా ప్రజలు సమస్యలను ఏకరువు పెట్టి ఆయనను నిలదీశారు. మునిసిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిదో వార్డులోని కృష్ణాశ్రమం వద్ద ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. సమావేశం ముగియగానే మహిళలు శాంతమ్మ, లక్ష్మీదేవి లేచి ‘వార్డులో పర్యటించండి, అభివృద్ధి గురించి తెలుస్తుంది’ అని మంత్రితో అన్నారు. ‘డ్రెయినేజీలపై ఆక్రమణల తొలగింపు నిబంధనలు సాధారణ ప్రజలకేనా.. టీడీపీ వారికి వర్తించవా’ అంటూ శాంతమ్మ ప్రశ్నించారు.
‘451 ఇళ్లుండే 8వ వార్డులో రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయిందని, అందులో పందుల స్వైర విహారం చేస్తుండటంతో దుర్వాసన భరించలేకపోతున్నామని, పట్టించుకునేవారే లేరని లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గతంలో 6వ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ చైర్మన్ అయితే ఆయన ఇంటి ముందు రోడ్డు వేయించుకున్నారు. ప్రస్తుతం 8వ వార్డు కౌన్సిలర్ జ్యోతి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆమె ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేయించుకుంటున్నారు. మిగిలిన వార్డు ప్రజలు మనుషులు కారా?’ అని ప్రశ్నించారు. దీంతో మంత్రి వార్డులో కొంతభాగం పర్యటించారు.
ఏ ఇంటికెళ్లినా పింఛన్ రాలేదని, ఇళ్లు ఇవ్వలేదని, మరుగుదొడ్లు మంజూరు కాలేదని ఇలా ఏదోక సమస్యను ఏకరువుపెట్టారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పస్తులతో బతుకుబండి లాక్కొస్తున్నామని చేనేతలు వాపోయారు. మూడేళ్లుగా వార్డును పట్టించుకునే వారే లేరని వార్డు ప్రజలంతా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి మాట్లాడుతూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి ముందు 8వ వార్డు ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
మీకో దండం : మంత్రి వద్ద టీడీపీ సీనియర్ నాయకుడి నిర్వేదం
‘సార్.. నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి టీడీపీకే ఓటు వేశాను, అదే పార్టీలోనే ఉన్నాను. ఇప్పటికీ పూరిగుడిసెలోనే ఉంటున్నాను. మగ్గం ద్వారానే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకొక ఇల్లు మంజూరు కాలేదు. ప్రభుత్వం నుం డి ఎలాంటి సహాయ, సహకారాలు లేవు. వార్డులోని ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్తే ఆమె పట్టించుకోవడం లేదు. కనీసం బాడుగ ఇళ్లకు మరుగుదొడ్లయినా మంజూరు చేయమంటే అదీ చేయలేదు. ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు ఈ మేలు చాలు సార్’ అంటూ స్థానికంగా టీడీపీలో సీనియర్ నాయకుడైన చేనేత కార్మికుడు రాజు మంత్రికి దం డం పెట్టారు. ‘ఇప్పుడు నీకేం కావాలి చెప్పు’ అని మంత్రి అడిగినా ‘నాకు ఏమీ వద్దు సార్.. ఇప్పటివరకు పార్టీలో ఇచ్చిన మర్యాద చాలు’ అని నిర్మొహమాటంగా తెగేసి చెప్పారు.
⇔ అరుణ
అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని, కౌన్సిలర్ చుట్టూ, మున్సిపాల్టీ చుట్టూ తిరిగి తిరిగి చేసి అలసిపోయామని అరుణ మంత్రి కాలవ దృష్టికి తీసుకొచ్చింది. పింఛన్ ఇప్పిస్తామని మంత్రి చెప్పగా ‘ఏమో సార్ ఏమిస్తారో? ఎప్పుడిస్తారో?’ అంటూ నిర్వేదం వ్యక్తం చేసింది.
⇔ ఆంజనేయులు
చేనేత రుణమాఫీ అన్నారని, వడ్డీలేని రుణాలిప్పిస్తామన్నారని, ఏదీ ఇవ్వకపోగా కనీసం నేతన్నలను పట్టించుకునేవారే కరువయ్యారని ఆంజనేయులు మంత్రి వద్ద ఆవేదన చెందారు. ఇంట్లో మగ్గం నేస్తున్న ఆంజనేయులును మంత్రి పలుకరించగా ఆయన ఇలా స్పందించారు. ‘సార్ ఓనర్లతో ముడిసరుకులు తెచ్చి చీరలు నేస్తున్నాం. 15 రోజుల పాటు ఒక చీరను ఇద్దరం నేస్తే రూ.2,500 ఇస్తున్నారు. దాంతోనే బతుకీడ్చుతున్నాం’ అని విచారం వెలిబుచ్చారు. పిల్లల చదువులు భారం అవుతున్నాయని, బ్యాంకు ద్వారా రుణాలిప్పించి ఆదుకోవాలని కోరారు.
⇔ లక్ష్మీదేవి
అద్దె గుడిసెలో ఉన్నామని, ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుందామని అనుకుంటే పట్టించుకునే వారే లేరని లక్ష్మీదేవి మంత్రితో అన్నారు. ‘అర్హత ఉన్న మా లాంటి నిరుపేదలకు కాకుండా ఇళ్లు ఎవరికిస్తారు? గొప్పలు చెప్పడం కన్నా, స్వయంగా పరిశీలించి అర్హత ఉన్న మాలాంటి వారికి న్యాయం చేయండి సార్’ అని వేడుకున్నారు.
⇔ చంద్రకళ
‘సార్.. ఎలాంటి సౌకర్యాల్లేని ఈ వార్డులో జీవనం సాగిస్తున్న మా దీనావస్థను ఒకసారి పరికించండి. రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, ఎక్కడికక్కడ నీరు నిలబడి మురికికూపాలను తలపిస్తున్నాయి. ఆ మురుగులో పడి దొర్లుతున్న పందులను చూడండి. ఈ దుర్వాసనలో ఎలా బతకాలి, రోగాలు రావా?’ అంటూ నిలదీశారు. తాగడానికి నీరు కూడా సక్రమంగా రావడం లేదని, వచ్చినా కలుషితమైనవి వస్తున్నాయని, వాటిని ఎలా తాగాలని ప్రశ్నించారు.