అన్నదాతకు ఆదరవు
జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసేందుకు అనకాపల్లి మార్కెట్లో గిడ్డంగి
నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహణ
నిల్వ ఉంచిన వ్యవసాయ ఉత్పతులపై రుణ సదుపాయం
అనకాపల్లి, న్యూస్‌లైన్: గిడ్డంగి అభివృద్ధి రెగ్యులేటరీ అథారిటీ పేరిట రైతులకు ఉపయుక్తంగా నాబార్డ్ వినూత్న కార్యక్రమం రూపొందించింది. ఈ కార్యక్రమంలో రైతులు తమ పంటకు మెరుగైన ధరలు పొందే దిశలో మేలైన సేవలు అందనున్నాయి. 1000 మెట్రిక్ టన్నులకు పైగా గోదాం సామర్థ్యం ఉన్న అనకాపల్లి వ్యవసాయ మార్కెట్లో ఈ సేవలందించనున్నారు. దీనికి సంబంధించి మార్కెట్ కమిటీ కార్యదర్శికి హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 24వ తేదీన హైదరాబద్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన మార్కెట్ కమిటీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరుకానున్నారు.
రైతులకు ఏఏ సేవలు...
వ్యవసాయ సీజన్ అనిశ్చితికి మారడంతో రైతులు తాము పండించే పంటలకు సరయిన మద్దతు ధర అందడం లేదు. సీజన్ బట్టి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మారుతున్నాయి. డిమాండ్ లేనప్పుడు రైతులు తక్కువ ధరకైనా అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, నిల్వ చేసుకునే సామర్ధ్యం లేకపోవడం. ఈ నేపథ్యంలో అమల్లోకి రానున్న ఈ సేవల్లో భాగంగా రైతులు తాము పండించిన పంటలను గిడ్డంగిలో నిల్వ చేసుకోవచ్చు. ఈ సేవల్లో భాగంగా రైతుల ఉత్పత్తులు అంతర్జాలంలో పొందుపరుస్తారు. రైతులకు తనకు గిట్టుబాటు లభించిన వెంటనే ఆ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. రైతులు గిడ్డంగిలో నిల్వ చేసే ఉత్పత్తుల మేరకు బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేస్తారు. తమ ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ముతో బ్యాంకు రుణాన్ని తీర్చుకొనే వెసులుబాటు నాబార్డు అధికారులు కల్పించనున్నారు.
గిడ్డంగికి తుదిరూపు...
అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రస్తుతం నల్లబెల్లాన్ని నిల్వ చేసిన గోదాంనే ఈ సేవలకు వినియోగించనున్నారు. రైతుల ఉత్పత్తులను ఎంత కాలం నిల్వ చేసినా నష్టం కలగకుండా, ప్రధానంగా ఎలుకల దాడిని నుంచి తప్పించేందుకు ఫ్లోరింగ్‌ను గట్టిగా ఏర్పాటు చేయనున్నారు. గాలి, వెలుతురు సదుపాయాలను కల్పిస్తారు. ఈ గిడ్డంగి కొద్ది రోజుల్లో నాబార్డు ఏజీఎం పర్యవేక్షణలోకి వె ళ్లనుంది. తద్వారా జిల్లా రైతులకు మార్కెటింగ్, నిల్వ చేసే సదుపాయం, రుణ సదుపాయం ఒకే సారి లభించనున్నాయి.