రెండు రోజుల్లో భారీ పేలుళ్లు.. తప్పిన ముప్పు
న్యూఢిల్లీ: గుజరాత్లో బాంబు పేలుళ్లతో విధ్వంసం రచనకు ఉగ్రవాదులు కుట్ర చేశారు. ఉగ్రవాద నిరోదక దళం(యాంటీ టెర్రరిజం స్క్వాడ్) అప్రమత్తమవడంతో ఈ ప్రమాదం నుంచి రాష్ట్రం బయటపడినట్లయింది. వారు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న మరో రెండు రోజుల్లో వరుస పేలుళ్లు చోటుచేసుకునేవి. ఆదివారం ఉదయం దీనికి సంబంధించి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్టు చేసింది. వీరిద్దరు కూడా సోదరులు కావడం గమనార్హం. గుజరాత్‌లోని మత సంబంధ ప్రాంతాలే లక్ష్యంగా వీరు దాడికి వ్యూహం రచించి దానిని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటూ ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసుల వివరాల ప్రకారం గుజరాత్లో ఇస్లామిక్ స్టేట్ పేలుళ్లకు కుట్ర చేసిందని సమాచారం అందడంతో ఏటీఎస్ టీం అప్రమత్తమైంది. చోటిలా వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను లక్ష్యంగా దాడులకు వ్యూహాలు సిద్ధమయ్యాయని, దీనికి సంబంధించి రాజ్‌కోట్, భవన్‌నగర్ నుంచి ఇద్దరు సోదరులు ట్విట్టర్వంటి సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఐసిస్‌తో సంబంధాలు నెరుపుతున్నారని గ్రహించి వారిని ఆదివారం అరెస్టు చేశారు.
వీరి నుంచి పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని వసీమ్, నయీమ్ రామొదియాగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. గత రాత్రి పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లోనే పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని, వారిని అరెస్టు చేయడంతో ఆ ముప్పు తప్పిందని, అయినప్పటికీ అనుమానం ఉన్నచోట్ల గాలింపు చర్యలు చేస్తున్నామని ఏటీఎస్ డీఎస్పీ కేకే పాటిల్ చెప్పారు.